కవిస్వరం: విరించి కిటికీ
కిటికీ పేరుతో ఇంతకు ముందు కొన్నైనా కవితలు వచ్చే ఉంటాయి. పేరు పాతదేమో గానీ కవిత కొత్తగా ఉంది. నాలుగు పంక్తులతో కూడిన స్టాంజాలను అల్లుతూ జీవిత పరమార్థాన్ని చెప్పడానికి విరించి తన కవిత కిటికీలో చెప్పడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. జీవితం పరులకు పంచడానికి, కాకపోతే ప్రయోజనకరం కావడానికి మాత్రమేనని ఆయన చెప్పదలుచుకున్నారు.
ఒక్కో ప్రతీకను తీసుకుని వాటి ప్రయోజన రాహిత్యాన్ని, ప్రయోజనకరంగా మార్చాల్సిన అవసరాన్ని చెబుతూ జీవిత ప్రయోజకత్వాన్ని కవి చెప్పాడు. పుస్తకం స్థితిని మొదటి స్టాంజాలో చెప్పిన విరించి ఆ తర్వాత ఒక్కో స్టాంజాలో ఒక్కో స్థితికారకాన్ని తీసుకుని వాటిని ప్రయోజనకరంగా మార్చాల్సిన తీరేమిటో వివరిస్తూ వెళ్లాడు.
కాకి ఈకలు ఒక్క నెమలి కన్నుతోనైనా ఎగిరితే ఆనందదాయకంగా ఉంటుందని కూడా అంటాడు. రాల్చేసిన జీవితం జ్ఞాపకాల శవయాత్ర కాదంటూ వైరాగ్యాన్ని తోడుగా పంపే శ్మశానానికి ఒక్క కిటికీగానైనా మారాల్సింది అంటూ చెప్పి కవితను ముగిస్తాడు. వెలుగులు నింపడానికి కావాల్సిన ప్రతిక్రియలను ఆయన కవితలో చెబుతూ వెళ్లాడు. ఏ జీవితమైనా సరే, సమాజానికి వెలుగును ప్రసాదించాలనే ఆకాంక్షతో రాసిన కవిత.
- కాసుల ప్రతాప రెడ్డి

ఈ పుస్తకం అల్మారాల్లో
దాచుకోవల్సిందేమీ కాదు
ప్రతి పేజీని ముక్కలుగా చింపి
ఒక మనిషినైనా చేయాల్సింది.
ఈ పంజరమేమీ చకోర పక్షికోసం
ఎదురుచూడటం లేదు
రాలిన కొన్ని కాకీకలను పేర్చి
ఒక నెమలికన్నుతోనైనా ఎగరాల్సింది
ఈ నాలుగు బజార్ల కూడలిలో..
తార్రోడ్డసలు ఏ రస్తాకూ లేదు
మన్నులో మునిగిన ఇనుప విత్తనాలు
ఒక మినుప చెట్టుగా నైనా తేలాల్సింది
ఈ ఊదేసిన సిగరెట్ డబ్బాలో
పునర్జెన్మనెత్తే జీవితాలేవీ లేవు
ప్రాణభిక్షతో బ్రతికిన సిగరెట్ బట్ లు
ఒక దీపాన్నైనా వెలిగించాల్సింది
ఈ జ్ఞాపకాలేవీ చదివి పడేసిన
అజ్ఞాత కరపత్రాలు కావు
తుఫానుతోపాటు గాలికి ఎగిరి
ఒక కాగితం పడవగా నైనా ఆడాల్సింది
ఈ రాల్చేసిన జీవితమేమీ
జ్ఞాపకాల శవయాత్ర కాదు
వైరాగ్యాన్ని తోడుగపంపే శ్మశానానికి
ఒక కిటికీగానైనా మారాల్సింది.
- విరించి
23/1/15












Click it and Unblock the Notifications