చంద్రుడు కూడా బతికిపోయాడు గానీ..
Asteroid hitting Moon: అంతరిక్షంలో గతి తప్పిన ఓ గ్రహశకలం మొన్నటివరకు చంద్ర మండలాన్ని వణికించింది. భయాందోళనలకు గురి చేసింది. 2032లో చందమామను ఢీ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించడమే దీనికి కారణం. దీనికి గల అవకాశాలను కూడా పెంచుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టదనే విషయాన్ని ధృవీకరించింది.
ఆ గ్రహ శకలం- 2024 వైఆర్4. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) ద్వారా తాజాగా దీని కదలికలను పసిగట్టింది నాసా. చంద్రుడిపై గ్రహశకలం పడితే ఎదురయ్యే ముప్పుపై గతంలో నెలకొన్న అనిశ్చితి పూర్తిగా తొలగిపోయిందని తెలిపింది. నెలల తరబడి కొనసాగిన ఆందోళనకు ముగింపు పలికింది. గ్రహశకలం చంద్రుడిని సురక్షితంగా దాటిపోతుందని అధికారికంగా వెల్లడైంది. ఇదే విషయాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ప్రకటించింది.

ఈ గ్రహశకలం ఎంత మసకగా ఉందంటే- దాని కదలికలను అత్యాధునిక వెబ్ టెలిస్కోప్ మాత్రమే గుర్తించగలిగింది. చంద్రుడు-భూమి మధ్య దూరంలో అతి తక్కువ కాంతిని ప్రసరింపజేయడం దీని ప్రత్యేేకత. దీని కాంతి సుమారు 30 మాగ్నిట్యూడ్‌గా నమోదు చేసింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. మనిషి సాధారణ కంటితో చూడగలిగే మసక నక్షత్రం కంటే నాలుగు బిలియన్ రెట్లు తక్కువ కాంతిని ప్రసరింపజేసిందీ అస్టరాయిడ్.
భూమిపై ఉన్న ఏ టెలిస్కోప్ లేదా ఇతర అంతరిక్ష పరిశీలన కేంద్రం కూడా దీనిని గుర్తించలేకపోయింది. ఒక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మాత్రమే తన అసాధారణ సున్నితత్వం, కదిలే లక్ష్యాలను ఖచ్చితంగా ట్రాక్ చేయగల సామర్థ్యంతో ఈ అద్భుతాన్ని రికార్డు చేసింది. ఈ అస్టరాయిడ్ కదలికలను గుర్తించడానికి, దీన్ని పాత్ వేను ట్రాక్ చేయడానికి కిందటి నెల చివరివారంలో కొన్ని గంటల పాటు ప్రత్యేక ఎక్స్‌పోజర్‌లను ఉపయోగించింది..వెబ్ టెలిస్కోప్.
2024 చివరిలో గుర్తించిన ఈ గ్రహశకలం మొదట భూమిని ఢీకొడుతుందని అంచనా వేసింది నాసా. దీనికి గల అవకాశాలను గరిష్ఠంగా 3.8 వరకూ అంచనా వేసింది. 2032 డిసెంబర్ 31న భూమిని తాకే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత దీన్ని సవరించింది. గతి తప్పిన ఈ అస్టరాయిడ్ చంద్రుడి వైపు దూసుకెళ్తోందని, 2032లో జాబిల్లిని ఢీ కొడుతుందని అప్పట్లోనే ప్రకటించింది. ఇప్పుడు చంద్రుడికి కూడా ముప్పు లేదని తేల్చింది.
ఈ గ్రహశకలం కక్ష్యను శాస్త్రవేత్తలు 2024 చివరిలో గుర్తించారు. 2025 మే వరకు మాత్రమే ట్రాక్ చేశారు. మళ్లీ కిందటి నెల చివరివారంలో ఇది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కంటపడింది. దాదాపుగా ఎనిమిది నెలల పాటు కనిపించకుండా పోయింది. తాజాగా దీన్ని గుర్తించడం ద్వారా అదనపు డేటాను సేకరించింది. ట్రాకింగ్ డేటాను 2025 మే నుండి కిందటి నెల చివరివరకు విశ్లేషించింది. చంద్రుడికి కూడా ముప్పు తప్పిందని ప్రకటించింది.












Click it and Unblock the Notifications