విరుచుకుపడిన తుఫాను! ముక్కలైన జపాన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. కానీ
పరిమితమైన భూభాగం ఉండే దేశాల్లో రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం పెద్ద సవాలు. ఈ సమస్యను అధిగమించడానికి జపాన్ ఒక అద్భుతమైన సాంకేతిక ఆలోచన చేసింది. ఖాళీగా ఉండే డ్యామ్‌లు, జలాశయాల నీటి ఉపరితలంపైనే వేలాది సోలార్ ప్యానెళ్లను పరిచి, తేలియాడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించింది. కానీ, ప్రకృతి సవాళ్ల ముందు సాంకేతికత ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. నిర్మించిన ఏడాదిన్నరకే విరుచుకుపడిన రాకాసి తుఫాను దాటికి నీటిపై తేలియాడే ప్లాంట్ ధ్వంసమవ్వడమే కాకుండా, విచిత్రంగా నీటిపైనే మంటలు చెలరేగడం ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
చిబా ప్రిఫెక్చర్‌లోని యమాకురా డ్యామ్ జలాశయంపై 2018 మార్చిలో ఈ భారీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. 'క్యోసెరా టిసిఎల్ సోలార్' జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో సుమారు 44 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. 13.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో, 50,904 సోలార్ మాడ్యూళ్లను నీటిపై అమర్చారు. ఆ సమయంలో జపాన్‌లోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌గా ఇది చరిత్రకెక్కింది. ఏటా సుమారు 16,170 మెగావాట్ గంటల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ, దాదాపు 4,970 గృహాల ఇంధన అవసరాలను తీర్చేలా ఈ ప్లాంట్‌ను ఆవిష్కరించారు. వ్యవసాయ, నగర భూములకు ఇబ్బంది కలగకుండా పారిశ్రామిక జలాశయాన్ని వినియోగించుకోవడం వల్ల దేశవ్యాప్తంగా దీనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

'ఫాక్సయ్' తుఫాను విధ్వంసం: 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు!
అయితే, ఈ ప్లాంట్ ప్రారంభమైన 18 నెలలకే, అంటే 2019 సెప్టెంబర్‌లో ఊహించని విపత్తు వచ్చిపడింది. తీవ్రమైన 'ఫాక్సయ్' (Typhoon Faxai) తుఫాను గంటకు దాదాపు 207 కిలోమీటర్ల భయంకరమైన గాలులతో చిబా ప్రాంతాన్ని వణికించింది. జలాశయంపై విరుచుకుపడిన ఈ ప్రచండ గాలుల దాటికి సోలార్ ఫ్లోటింగ్ వ్యవస్థ తట్టుకోలేకపోయింది. నీటిపై గొలుసుకట్టుగా కట్టి ఉంచిన ప్యానెళ్లు ఊడిపోయి, ఒకదానిపై ఒకటి పడిపోయాయి. ఒకే చోట పెద్ద ఎత్తున ప్యానెళ్లు పేరుకుపోయాయి. ఫలితంగా విద్యుత్ ప్రవాహంలో షార్ట్ సర్క్యూట్ జరగి ఏకంగా నీటిపైనే మంటలు చెలరేగాయి. సుమారు 50 ప్యానెళ్లు టపటపా కాలిపోగా, ప్లాంట్‌లో అత్యధిక భాగం తీవ్రంగా దెబ్బతింది.
యాంకర్లు తెగి.. త్రికోణ విచ్ఛిన్నం!
ఈ విపత్తుపై జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోతుగా విచారణ జరిపింది. నీటిపై ప్లాంట్ కదలకుండా ఉంచేందుకు 420 యాంకర్లు, 823 మూరింగ్ లైన్లను ఉపయోగించారు. అయితే, తుఫాను గాలుల తీవ్రతకు ప్రాజెక్ట్ దక్షిణ మధ్య భాగంలో ఉన్న 7 కీలకమైన యాంకర్లు ఊడిపోయాయి. దీంతో గాలుల ఒత్తిడి మిగిలిన భాగంపై అసమానంగా పడి, రబ్బర్ బోల్టులు వరుసగా విరిగిపోయాయి. పర్యవసానంగా, ఇదొక గొలుసుకట్టు విపత్తులా మారి, నీటిపై ఉన్న ప్లాంట్ మూడు ముక్కలుగా విడిపోయిందని విచారణలో తేలింది. భారీ వైశాల్యంతో ఒకే ఐలాండ్‌లా ప్రాజెక్ట్‌ను నిర్మించడం కూడా ముప్పు తీవ్రతను పెంచిందని ఇంజనీర్లు గుర్తించారు.
పాఠాలు నేర్చిన ఇంజనీరింగ్.. మళ్లీ కొత్తగా పునర్నిర్మాణం!
ఈ ఘటనతో ప్రాజెక్ట్‌ను వదిలేయకుండా, సవాలుగా స్వీకరించారు జపాన్ నిపుణులు. లోపాలను సరిదిద్దుతూ ప్రాజెక్ట్ రీ-డిజైనింగ్ పనులు ప్రారంభించారు. ఒకే భారీ దీవిలా కాకుండా, ఒత్తిడిని తట్టుకునేలా చిన్న చిన్న చతురస్రాకారపు దీవులుగా (Square-shaped islands) విభజించి ప్లాంట్‌ను పునర్నిర్మించారు. తద్వారా తీవ్రమైన గాలులు వీచినా ఒత్తిడి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నీటిలో సురక్షితంగా సర్దుబాటు అవుతుంది. 2021 అక్టోబర్ నాటికి 14 మెగావాట్ల ఈ ప్లాంట్‌ను విజయవంతంగా పునరుద్ధరించి తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.














Click it and Unblock the Notifications
