Loksabha News: జెనీవా మీట్‌లో లోక్‌సభ స్పీకర్ కీలక ప్రతిపాదన.. టెక్నాలజీ పరుగులకు కళ్లెం వేసేలా..
Om Birla News: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ప్రపంచానికి సమీప భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని పలువురు నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. AI వంటి టెక్నాలజీ రానున్న రోజుల్లో మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా కీలక ప్రసంగం చేశారు.
ఇటీవల జెనీవాలో జరిగిన ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (IPU) 149వ అసెంబ్లీలో ఓం బిర్లా పాల్గొన్నారు. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగంలో పార్లమెంట్‌ల మధ్య చర్చలు మరియు సహకారంతో పాటు ఉమ్మడి ప్రయోజనాలకు బీజం పడాల్సిన అవసరం ఉందన్నారు. 'మరింత శాంతియుతమైన మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలను ఉపయోగించడం' అనే అంశంపైన అక్కడ చర్చించారు. ఈ సమావేశంలో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు.

IPU వంటి ఫోరమ్ ద్వారా భాగస్వామ్య కార్యాచరణ ప్రణాళికలు, ఉమ్మడి ప్రయత్నాల ద్వారా పార్లమెంటులు ప్రపంచంలోని సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం చేయగలవని బిర్లా ఆశాభావం వ్యక్తం చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ఓ ప్రకటన విడుదల చేసింది. సాంకేతికత ప్రయోజనాలను సమానంగా పంచుకోవడంతో పాటు డేటా గోప్యత, కృత్రిమ మేధస్సు (AI) సరైన వినియోగం, సాంకేతిక రంగంలో తగిన నియంత్రణ వ్యవస్థ అవసరమని నొక్కి చెప్పారు. IPU ఫోరమ్‌తో పాటు జాతీయ పార్లమెంట్‌లు కూడా ఈ సమస్యపై దృష్టిసారించాలని కోరారు.
సాంకేతిక పురోగతులు, శాస్త్ర పరిశోధనలు మరియు వినూత్న విధానాల కలయిక కోసం బిర్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాటి ఫలాలు సమానంగా మరియు బాధ్యతాయుతంగా పంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ - OSOWOG'ను ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 76 నుంచి 203 గిగావాట్లకు పెరిగిందని తెలిపారు. వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఇండియా నిబద్ధతను నొక్కిచెప్పడానికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, బయో-ఫ్యూయల్ అలయన్స్ వంటి కార్యక్రమాల గురించి కూడా మాట్లాడారు.












Click it and Unblock the Notifications