ఈ సాయంత్రమే పడమటి ఆకాశంలో అద్భుతం- మళ్లీ ఎప్పుడో గానీ
ఖగోళ ప్రియులకు కనువిందు చేసే అద్భుతమైన ఘట్టం ఈ సాయంత్రం ఆవిష్కృతం కాబోతోంది. రాత్రివేళ ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించే రెండు గ్రహాలు ఒకదానికొకటి అత్యంత సమీపానికి రాబోతున్నాయి. ఆ రెండు గ్రహాలు.. శుక్రుడు (వీనస్), బృహస్పతి (జుపిటర్). వీటి కలయిక కొన్ని రోజుల పాటు రాత్రి ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. దీనికోసం ఖగోళ వీక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.
ఈ ప్లానెటరీ పరేడ్ ఈ సాయంత్రం ఉండబోతోంది. ఆ తర్వాత కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. పశ్చిమ దిశలో సంధ్యా సమయంలో ఈ అద్భుతాన్ని నేరుగాచూడవచ్చు. సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల నుంచి వేకువ జామున 2 గంటల మధ్య సమయం వీటిని చూడటానికి అత్యంత అనుకూలం. పడమటి క్షితిజరేఖకు స్పష్టంగా కనిపించే ప్రదేశం నుండి చూస్తే ఈ వ్యూని మరింత చక్కగా ఆస్వాదించవచ్చు.

ఈ రెండు వీనస్, జుపిటర్ గ్రహాలు 1.6 డిగ్రీల దూరంలో మాత్రమే కనిపిస్తాయి. ఇది పౌర్ణమి నాటి చంద్రుని వ్యాసం కంటే సుమారు మూడు రెట్లు ఉంటుంది. సాధారణ బైనాక్యులర్‌ల ద్వారా ఈ రెండింటినీ ఒకే ఫీల్డ్ ఆఫ్ వ్యూలో చూడవచ్చు, ఇది ఖగోళ పరిశీలకులకు అరుదైన అవకాశం. ఆ సమయంలో సూర్యుని నుండి జుపిటర్ ఆరు ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో ఉంటుంది. సూర్యుడి నుంచి శుక్రుడికి మధ్య ఉండే దూరం 1.2 ఆస్ట్రనామికల్ యూనిట్లు. అంటే జుపిటర్ తో పోలిస్తే శుక్రుడు భూమికి అయిదు రెట్లు దగ్గరగా ఉన్నాడని అర్థం.
శుక్రుడు ఆకాశంలో పైకి ఎదుగుతుడటం, అదే స్థాయిలో జుపిటర్ దూరంగా జరుగుతుండటం వల్ల ఈ రెండూ కూడా భూమిపై నుంచి చూసే వారికి అత్యంత సమీపానికి వచ్చినట్లు కనిపిస్తాయి. ఈ రెండింటి కక్ష్య, పరిభ్రమణ వేగం భిన్నం. శుక్రుడు సూర్యుని చుట్టూ 224.7, భూమి 365.25, బృహస్పతి 11.86లో ఒక ప్రదక్షిణ పూర్తి చేస్తాయి. ప్రస్తుతం బృహస్పతి నుండి భూమి దూరంగా జరుగుతోంది. ఫలితంగా అది సాయంత్రం ఆకాశంలో కనుమరుగవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. జూలై 29 నాటికి జుపిటర్ పూర్తిగా సూర్యుడి కాంతిలో కలిసిపోతుంది.
మరోవైపు, శుక్రుడు వేగంగా భూమికి దగ్గరవుతూ, సాయంత్రం వేళల్లో ప్రకాశవంతంగా మారుతుంది. పడమటి సంధ్యాతారలా కనువిందు చేస్తుంది. గురుగ్రహం కంటే శుక్రుడి ప్రకాశం అత్యధికం. ఇది -3.9 మాగ్నిట్యూడ్‌తో ఉండగా, బృహస్పతిది -1.7 మాగ్నిట్యూడ్. భూమి నుండి చూసినప్పుడు బృహస్పతి కంటే దాదాపు 7.5 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది శుక్రగ్రహం. శుక్రుడి దట్టమైన మేఘావృతం ఉపరితలం అధికంగా సూర్యరశ్మిని పరావర్తనం చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది.
ఖగోళ పరిశీలన కోసం బైనాక్యులర్లు చక్కగా ఉపయోగపడతాయి. టెలిస్కోప్ ద్వారా చూస్తే.. బృహస్పతి చుట్టూ ఉండే నాలుగు అతిపెద్ద ఉపగ్రహాలైన గ్యానిమీడ్, యూరోపా, కాలిస్టో, అయోలను కూడా కనిపిస్తాయి. ఈ ప్లానెటరీ పరేడ్ లో భాగంగా, తర్వాత వచ్చే ప్రధాన ఘట్టం నవంబర్ 15న సంభవిస్తుంది. ఆ రోజు సూర్యోదయానికి ముందు, బృహస్పతి, అంగారక గ్రహాలు 1.2 డిగ్రీల సమీప దూరం నుండి ఒకదానికొకటి దర్శనమివ్వనున్నాయి.












Click it and Unblock the Notifications