వైస్ కెప్టెన్‌గా బుడ్డోడు!
Vaibhav Suryavanshi: బీహార్ క్రికెట్ జట్టు 14 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్‌గా నియమించింది. జట్టుకు సకిబుల్ గని కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని బీహార్ క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) ప్రకటించింది. బీహార్ తన ప్లేట్ లీగ్ సీజన్‌ను అక్టోబర్ 15 నుంచి పాట్నాలోని మొయినుల్ హక్ స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌తో ఆరంభించనుంది. గత రంజీ సీజన్‌లో ఒక్క విజయం కూడా సాధించకపోవడంతో బీహార్‌ను ప్లేట్ లీగ్‌కు మార్చారు. అయితే వైభవ్ సూర్యవంశీ జట్టులో ఉండటం కొత్త ఆశలను చిగురింపజేసింది.
రికార్డుల రారాజు వైభవ్
వైభవ్ సూర్యవంశీకి కేవలం 14 ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులను సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 2023-24 సీజన్‌లో 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ నుంచి కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఈ సంవత్సరం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి, పురుషుల క్రికెట్‌లో అత్యంత చిన్న వయసు (14 ఏళ్లు) లో టీ20 సెంచరీ చేసిన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ కూడా.

వీటితో పాటు వైభవ్ సూర్యవంశీ భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో కూడా పాల్గొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వైభవ్ మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ పూర్తి రంజీ సీజన్‌లో బీహార్ తరఫున ఆడే అవకాశం లేదు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది జింబాబ్వే, నమీబియాలో జరగనున్న అండర్-19 ప్రపంచ కప్ 2026 కోసం సన్నద్ధం కానున్నాడు.
బీహార్ జట్టు స్క్వాడ్:
పీయూష్ కుమార్ సింగ్, భాస్కర్ దూబే, సకిబుల్ గని (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), ఆర్ణవ్ కిశోర్, ఆయుష్ లోహరుకా, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సాకిబ్ హుస్సేన్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు సింగ్, ఖాలీద్ ఆలం, సచిన్ కుమార్.












Click it and Unblock the Notifications