అందుకే సూర్యకుమార్ యాదవ్ పై వేటు వేశాం: అజిత్ అగార్కర్
టీ20 ప్రపంచకప్‌లో భారత్ ను విజేతగా నిలబెట్టిన మూడు నెలల వ్యవధిలోనే సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీ20 జట్టు కెప్టెన్సీని కోల్పోవడమే కాకుండా, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ఎంపిక చేసిన జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు. ఈ కీలక, సంచలనాత్మక నిర్ణయాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా వెల్లడించారు. భవిష్యత్తు కోసం జట్టును పునర్నిర్మించాల్సిన అవసరం, అలాగే సూర్యకుమార్ ప్రస్తుత ఫామ్ లేమి ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ కప్ తర్వాత జట్టు భవిష్యత్తు కార్యాచరణపై పునఃసమీక్ష చేయడం సహజమని అగార్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "సూర్యకుమార్ విషయంలో ఇది చాలా కఠినమైన నిర్ణయం. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇలా జరగడం ఎవరూ కోరుకోనిది. వచ్చే ప్రపంచ కప్ వరకు ఉన్న రెండేళ్ల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు కోసం ఈ మార్పు అవసరమని భావించాం," అని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వివరించారు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ.. బ్యాటర్‌గా సూర్యకుమార్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. టోర్నీలో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 136.72 స్ట్రైక్ రేట్‌తో చేసింది 242 పరుగులే. ఈ ఐపీఎల్ లో కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో 20.76 సగటు, 147.54 స్ట్రైక్ రేట్‌తో 270 పరుగులు మాత్రమే చేయగలిగారు.
ఇక కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించడం ద్వారా, సెలెక్టర్లు సమర్థవంతమైన నాయకత్వంపై దృష్టి పెట్టినట్టయింది. గత కొన్ని సీజన్లుగా శ్రేయస్ తన బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ వస్తోన్నాడు. "శ్రేయస్ నాయకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ ఫ్రాంచైజీలకు నాయకత్వం వహించి, విజయాలు అందించడం మనం చూశాం. కెప్టెన్‌గా అతనికి ఉన్న అనుభవం, ఇటీవలి ఆటతీరు ఈ ఎంపికకు దోహదపడ్డాయి," అని అగార్కర్ పేర్కొన్నారు.
2023 డిసెంబర్ తర్వాత శ్రేయస్ టీ20 జట్టులో లేనప్పటికీ, ఐపీఎల్‌లో ఆయన ప్రదర్శన నిలకడగా సాగింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ, శ్రేయస్‌కు తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలపడంతో పాటు, అంతకుముందు ఢిల్లీ, పంజాబ్ జట్లను ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో శ్రేయస్ కీలక పాత్ర పోషించాడు.
2025 ఐపీఎల్‌లో 175.07 స్ట్రైక్ రేట్‌తో 604 పరుగులు, 2026 సీజన్‌లో 168.81 స్ట్రైక్ రేట్‌తో 498 పరుగులు సాధించి అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ప్రపంచ కప్ గెలిచిన సారథిని పక్కన పెట్టి, శ్రేయస్‌కు పగ్గాలు అప్పగించడం ద్వారా భారత సెలెక్షన్ కమిటీ భవిష్యత్తు వ్యూహాలను అమలు చేస్తోంది. ఫామ్ సమస్యలు, రెండేళ్ల సుదీర్ఘ ప్రణాళిక దృష్ట్యా ఈ మార్పు అనివార్యమైందని స్పష్టమవుతోంది. కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రయాణం ప్రపంచ కప్ విజయంతో ఘనంగా ముగిసినప్పటికీ, జట్టులో కొనసాగే విషయంలో నిరాశ ఎదురైంది.


Click it and Unblock the Notifications