సింగ్ ఈజ్ కింగ్: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్..!!
Arshdeep Singh: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. మూడు చొప్పున వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. టీ20 సిరీస్ ముగిసింది. భారీ వర్షం వల్ల తొలి మ్యాచ్ రద్దు కాగా.. చివరి రెండింట్లో తలొకటి గెలిచాయి. సిరీస్ సమం అయింది.
జొహాన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా బోణీ కొట్టింది. టీ20 సిరీస్‌లో చూపిన దూకుడును ఇక్కడా కొనసాగిస్తోంది భారత్. తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి, మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యతలోకి దూసుకెళ్లింది.

టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. రీజా హెండ్రిక్స్, రస్సీ వాన్ డెర్ డుస్సాన్ డకౌట్ అయ్యారు. ఈ ఇద్దరి వికెట్లను అర్ష్‌దీప్ సింగ్ పడగొట్టాడు. వరుస బంతుల్లో వారిద్దరినీ పెవిలియన్ దారి పట్టించాడు. అక్కడ ఆరంభమైన వికెట్ల పతనానికి ఎక్కడా బ్రేకులు పడలేదు. ఇంటర్వెల్ అనేది లేకుండా వికెట్లు టపటపమంటూ రాలిపోయాయి.
27.3 ఓవర్లల్లో 116 పరుగులకు కుప్పకూలింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ పెహ్లుక్వాయో ఒక్కడే టాప్ స్కోరర్. 33 పరుగులు చేశాడు. ఓపెనర్ టోనీ డీ జోర్జీ- 28, కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్- 12, తబ్రేజ్ షాంసీ- 11 పరుగులు చేశారు. మిగిలిన వారందరూ డబల్ డిజిట్‌ను కూడా అందుకోలేకపోయారు. అనంతరం ఈ లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది భారత్. 16.4 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. తన 10 ఓవర్ల కోటాలో 37 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు పడగొట్టాడు. మరో ఎండ్‌లో అతనికి సహకరించారు మరో పేస్ బౌలర్ అవేష్ ఖాన్. ఎనిమిది ఓవర్లల్లో 27 పరుగులకు నాలుగు వికెట్లను నేలకూల్చాడు. మరో వికెట్ కుల్‌దీప్ యాదవ్ ఖాతాలో పడింది.
అయిదు వికెట్లను పడగొట్టడంతో అర్ష్‌దీప్ సింగ్ ఓ సరికొత్త చరిత్ర సృష్టించినట్టయింది. దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికా జట్టుపై అయిదు వికెట్లు తీసుకున్న ఏకైక భారత బౌలర్ అతనొక్కడే. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఈ ఘనతను అందుకోలేదు. మొట్టమొదటి సారిగా ఫైవ్ వికెట్స్ హాల్‌తో తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు.












Click it and Unblock the Notifications