షూటింగ్లో పసిడి మెరుపులు.. ఒకే రోజు 6 మెడల్స్!
Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ పతకాల పంట పండించింది. శుక్రవారం నాటి పోటీల్లో భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో సహా మొత్తం 6 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. మహిళల పోల్ వాల్ట్‌లో బరణిక ఇలంగోవన్ కాంస్య పతకం సాధించగా.. షూటింగ్లో సురుచి సింగ్-కమల్జీత్ జంట భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది. దీనితో భారత్ పతకాల సంఖ్య 23కు(2 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు) చేరింది.
షూటింగ్లో స్వర్ణం
మహిళల, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్, కమల్జీత్ జంట అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జంట 486.6 పాయింట్లు సాధించి ఆసియా గేమ్స్ రికార్డును నెలకొల్పింది. ఇందులో సురుచి 245.7 పాయింట్లు, కమల్జీత్ 238.9 పాయింట్లు సాధించారు. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ టీమ్ ఈవెంట్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది.

పోల్ వాల్ట్‌లో బరణిక హిస్టారికల్ విక్టరీ
మహిళల పోల్ వాల్ట్ ఫైనల్లో బరణిక ఇలంగోవన్ 4.15 మీటర్ల ఎత్తును దాటి కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ చరిత్రలోనే పురుషుల లేదా మహిళల విభాగంలో పోల్ వాల్ట్‌లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా బరణిక నిలిచింది. కజకిస్తాన్ కు చెందిన పొలినా ఇవనోవాతో కలిసి ఆమె ఈ మూడో స్థానాన్ని పంచుకుంది.
గుల్వీర్ సింగ్‌కు రజతం.. మన్‌ప్రీత్‌కు కాంస్యం
అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 10,000 మీటర్ల రేసులో భారత రేసర్ గుల్వీర్ సింగ్ 28:29:38 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గతంలో హాంగ్జౌ ఆసియా క్రీడల్లో సాధించిన కాంస్యాన్ని ఆయన ఈ సారి రజతంగా అప్‌గ్రేడ్ చేసుకున్నాడు. అలాగే మహిళల షాట్‌పుట్ ఫైనల్లో మన్‌ప్రీత్ కౌర్ 17.17 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని భారత్‌కు అందించింది.
బ్యాడ్మింటన్‌లో నిరాశ.. కబడ్డీ, స్క్వాష్‌లో ఆశలు
పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి జంట తొలి రౌండ్లోనే థాయిలాండ్ జోడీ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే పురుషుల, మహిళల కబడ్డీ జట్లు ఫైనల్స్ కు చేరి పతకాలను ఖాయం చేయగా.. స్క్వాష్ విభాగంలో జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్, అనాహత్ సింగ్, అభయ్ సింగ్‌లు సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లి భారత్‌కు మరో మూడు పతకాలను ఖరారు చేశారు.














Click it and Unblock the Notifications
