బుమ్రా చుక్కలు చూపించాడు-ఒప్పుకున్న ఆసీస్ ఓపెనర్ ..!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ తాజాగా జరిగింది. ఈ సిరీస్ ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే సిరీస్ లో భారత బ్యాట్స్ మెన్ వైఫల్యంతో ఆసీస్ కు సిరీస్ ను చేతులారా అప్పగించినా.. బౌలింగ్ విభాగంలో మాత్రం టీమిండియా మెరుగ్గా రాణించింది. ముఖ్యంగా భారత పేసర్లు కంగారూలకు చుక్కలు చూపించారు. ఈ విషయాన్ని సిరీస్ మధ్యలో అంగీకరించకపోయినా ఇప్పుడు నెమ్మదిగా ఆ విషయాన్ని ఆసీస్ బ్యాట్స్ మెన్ బయటపెడుతున్నారు.
భారత్ తో స్వదేశంలో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియా పేసర్ జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో ఎక్కువగా అవుట్ కాని ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా..ఈ సిరీస్ లో మాత్రం ఆడిన 8 ఇన్నింగ్స్ లో ఏకంగా 6 సార్లు పెవిలియన్ బాట పట్టాడు. ముఖ్యంగా బుమ్రా స్వింగర్లకు ఖవాజా వద్ద సమాధానమే లేకుండా పోయింది. దీంతో ఓపెనర్ గా వచ్చినా సిరీస్ లో ఖవాజా భారీ స్కోర్లు చేయలేకపోయాడు. దీనిపై తాజాగా ఈ ఆసీస్ ఓపెనర్ స్పందించాడు.

బుమ్రా మ్యాజిక్ ను బుమ్రాడ్ గా అభివర్ణించిన ఉస్మాన్ ఖవాజా .. భారత్ తో టెస్టు సిరీస్ లో తాను ఈ ఫీలింగ్ అనుభవించానని చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే, తాను బుమ్రాడ్ ని పొందుతున్నానంటూ సిడ్నీ మ్యాచ్ తర్వాత ఏబీసీ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ బుమ్రా వ్యాఖ్యానించాడు. అభిమానులు తనను ఏం జరుగుతోందని అడిగారని, కానీ తాను నిజాయితీగా బుమ్రాడ్ అయిపోయానని చెప్పాల్సి వచ్చిందన్నాడు.
ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ లో బౌలర్ తో పాటు రెండు టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతల్నీ బుమ్రా మోశాడు. చివరికి సిడ్నీ టెస్టులో గాయపడి బౌలింగ్ చేయకపోయినా చివర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ సిరీస్ లో బుమ్రా మొత్తం మీద 13.06 సగటుతో 32 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరీస్‌ను ముగించాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు.
దీనిపై ఖవాజా స్పందిస్తూ బుమ్రా మంచి బౌలర్, మంచి వ్యక్తి అని, తాను అతన్ని 2018 నుంచి చూస్తున్నట్లు తెలిపాడు. ఈ సిరీస్ లో మాత్రం బుమ్రా చాలా కఠినంగా కనిపించాడన్నాడు.












Click it and Unblock the Notifications