IPL 2024: దుబాయ్ లో ఐపీఎల్ 2024 ? బీసీసీఐ తాజా ప్లాన్ ఇదే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ నిర్వహణకు సర్వం సిద్దమవుతున్న వేళ బీసీసీఐ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్ ల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి.. ఐపీఎల్ టోర్నీని ఇక్కడే నిర్వహిస్తే తలెత్తే ఇబ్బందులపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో అధికారికంగా నిర్ణయం ప్రకటించనుంది.
భారత్ వేదికగా ఇప్పటికే ఐపీఎల్ 2024 తొలి దశ మ్యాచ్ లను నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ.. రెండో దశ మ్యాచ్ ల విషయంలో తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది. అయితే తొలి దశ అయినా రెండో దశ అయినా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రకటించే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో పలు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.

ఇందులో ఐపీఎల్ 2024 తొలి దశను భారత్ లోనే నిర్వహించి, రెండో దశను మాత్రం యూఏఈకి మార్చాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. గతంలో 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఐపీఎల్ టోర్నీ తొలి దశను బీసీసీఐ దుబాయ్ లోనే నిర్వహించింది. ఈసారి మాత్రం తొలి దశను ఇక్కడే నిర్వహించి రెండో దశను మాత్రం యూఏఈకి మార్చాలని భావిస్తోంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాల్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు పలు ఐపీఎల్ జట్లు తమ ఆటగాళ్లను పాస్ పోర్టులను తమకు సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2024 తొలి దశ మ్యాచ్ లు ఈ నెల 22న మొదలై ఏప్రిల్ 7 వరకూ జరగనున్నాయి. ఈ లెక్కన తొలి దశలో మొత్తం 21 మ్యాచ్ లు ప్లాన్ చేశారు. ఎలాగో ఏప్రిల్ 7 లోపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండే అవకాశాలు తక్కువే. కాబట్టి రెండో దశను దుబాయ్ కి మార్చుకుంటే సరిపోతుందని బీసీసీఐ భావిస్తోంది.












Click it and Unblock the Notifications