IPL 2025: ఈసారి ఆ బ్యాన్ ఎత్తేయబోతున్న బీసీసీఐ ? నేడు కెప్టెన్లతో చర్చ..!
ఈసారి ఐపీఎల్ ను గతంలో నిర్వహించిన టోర్నీల కంటే మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులో అంతర్జాతీయ క్రికెట్లో అమలవుతున్న ఓ కీలక నిబంధనను ఎత్తేసేందుకు సిద్దమవుతోంది. అదే జరిగితే కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో బీసీసీఐ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ ఐపీఎల్ కెప్టెన్లతో బీసీసీఐ కీలక సమావేశం నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ బంతికి ఆటగాళ్లు ఉమ్మి(లాలాజలం) రాసే నిబంధనపై ఐసీసీ నిషేధం ఉంది. అయితే దీన్ని తొలగించాలనే డిమాండ్ల కూడా అంతే స్ధాయిలో ఉన్నాయి. గతంలో ఇలా బంతికి ఉమ్మి రాసి దాని వల్ల ఎన్నో మ్యాచ్ లలో ఎన్నో జట్లు, ఆటగాళ్లు ప్రయోజనం పొందారు. అయితే ఇది ఆటగాళ్లకు అనుచిత ప్రయోజనం కలుగజేస్తోందని, మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తోందనే ఆరోపణలు వచ్చాయి. అయినా కొనసాగింది.. అయితే కోవిడ్ సమయంలో మాత్రం 2022లో వైరస్ భయాలతో దీనిపై నిషేధం విధించారు.

మార్చి 22 నుండి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బంతిపై ఇలా ఉమ్మి పూయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసే అంశాన్ని బీసీసీఐ చురుగ్గా పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను బీసీసీఐలో ఇప్పటికే అంతర్గతంగా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అలాగే ఇవాళ ముంబైలో జరిగే ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో దీన్ని బీసీసీఐ వివరించనుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ముందు జాగ్రత్త చర్యగా బంతిని మెరిపించేందుకు ఇలా ఉమ్మి పోసే నిబంధనను ఐసీసీ నిషేధించిన తర్వాత తిరిగి పునరుద్ధరించలేదు. కానీ ఐపీఎల్ ను ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నాల్లో బాగంగా ఈ రూల్ పై నిషేధం తొలగించబోతున్నారు.
కోవిడ్ కు ముందు వరకూ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బంతిపై ఉమ్మి రాయడం అనేది ఆటలో భాగంగానే ఉండేదని, ఇప్పుడు మనకు ఆ ముప్పు లేదు కాబట్టి, ఐపీఎల్ లో దీనిపై నిషేధాన్ని ఎత్తివేయడంలో ఎలాంటి హాని లేదని భావిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు ఎన్డీటీవీ తెలిపింది. ఇది రెడ్ బాల్ క్రికెట్‌లో పెద్ద ప్రభావాన్ని చూపుతుందని తాము భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైట్ బాల్ గేమ్‌లో బౌలర్లకు కొంచెం దీని వల్ల ప్రయోజనం ఉన్నా.. దీనిని ఐపీఎల్ లో అనుమతించాలని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications