పాకిస్తాన్ తో మ్యాచ్ అందుకే ఆడుతున్నాం..! తేల్చేసిన కేంద్రం..!
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఎందుకంటే ఈ మ్యాచ్ విషయంలో వెనక్కి తగ్గరాదని కేంద్రం, వెనక్కి తగ్గాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని భారత్.. రెండు కంటే ఎక్కువ దేశాలు ఆడే టోర్నీలకు మాత్రం జట్టును పంపుతోంది. అయితే ఈ ఏడాది పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తో ఎక్కడా ఆడకూడదని కేంద్రం నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఆసియా కప్ కు జట్టును పంపుతోంది.
దీనిపై స్పందిస్తూ.. మన సైనికుల రక్తాన్ని పణంగా పెట్టి డబ్బులు సంపాదించుకుంటారా అని శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ప్రశ్నించారు. ఇతర విపక్షాలు కూడా పాకిస్తాన్ తో ఇలాంటి సమయంలో మ్యాచ్ వద్దని కేంద్రానికి సూచిస్తున్నాయి. అయినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు జట్టును ఎందుకు పంపుతున్నారనే విషయంలో ఓ ఆసక్తికర వాదన తెరపైకి తెస్తున్నాయి.

ఆసియాకప్ లో భాగంగా సెప్టెంబర్ 14న జరిగే మ్యాచ్ ను భారత్ బహిష్కరిస్తే పాకిస్తాన్ పోటీ లేకుండా విజేతగా నిలుస్తుందని కేంద్రం చెబుతోంది. అందుకే తాము భారత జట్టును దాయాదితో పోరుకు పంపుతున్నట్లు వెల్లడించాయి. ఈ టోర్నీ ఎలాగో ద్వైపాక్షిక సిరీస్ కాదు కాబట్టి భారత్ వెళ్లకపోవడం పాకిస్తాన్ కు కచ్చితంగా మేలు చేస్తుందని చెప్తున్నాయి. భారత్ ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తే.. పాకిస్తాన్ కు తదుపరి దశకు వెళ్లేందుకు వాకోవర్ లభిస్తుందనేది కేంద్రం వాదనగా ఉంది.
ఒలింపిక్స్ సమయంలో పాకిస్తాన్ జట్టు లేదా అథ్లెట్ భారతదేశంతో ఆడటానికి షెడ్యూల్ చేస్తే మనం ఎందుకు పోటీ పడకూడదు?, ఎందుకు పాకిస్తాన్‌ను గెలవనివ్వాలి ? పాకిస్తాన్ తో ఆడి ఓడించాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం షెడ్యూల్ ప్రకారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కు ఏర్పాట్లు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications