ధోనీ వారసుడి కోసం వేట మొదలు ? సీఎస్కే సీఈవోకు ఓనర్ సంకేతం..!
ఐపీఎల్ 2024 సీజన్ కు ముందే చెన్నె సూపర్ కింగ్స్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు వచ్చాయి. అయితే ధోనీ సహచరులు, చిన్ననాటి స్నేహితులు సైతం ధోనీ ఇప్పుడు రిటైర్ కాబోడంటూ సంకేతాలు ఇచ్చేశారు. దీంతో ఈ రూమర్లకు తాత్కాలికంగా తెరపడింది. కానీ చెన్నె సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం మాత్రం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. ధోనీ స్ధానంలో కెప్టెన్సీకి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం మొదలుపెట్టేసింది.
మహేంద్ర సింగ్ ధోనీ స్ధానంలో చెన్నై కెప్టెన్ అయ్యే అర్హతలు రోహిత్ శర్మకు ఉన్నాయంటూ సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు తాజాగా వ్యాఖ్యానించాడు. దీంతో ఇప్పటికే ముంబై జట్టు కెప్టెన్ గా తొలగించిన రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ వైపు చూస్తున్నాడా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో చెన్నై ఫ్రాంచైజీ కూడా ధోనీకి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీమ్ సీఈవో కాశీ విశ్వనాథ్ కు జట్టు యజమాని శ్రీనివాసన్ ఇచ్చిన మెసేజే ఇందుకు కారణం.

ఈసారి ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న చెన్నె సూపర్ కింగ్స్ జట్టు దృష్టంతా ఇప్పుడు టైటిల్ నిలబెట్టుకోవడంపైనే ఉంది. కానీ అదే సమయంలో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ ప్రత్యామ్నాయలపై అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు సీఈవో కాశీ విశ్వనాత్ సంకేతాలు ఇచ్చేశారు. ఈ మేరకు తన యజమాని శ్రీనివాసన్ నుంచి వచ్చిన సందేశాన్ని కూడా ఆయన బయటపెట్టారు.
కెప్టెన్సీ ప్రత్యామ్నాయాలపై అంతర్గత చర్చలు జరిగాయని, ఓనర్ శ్రీనివాసన్ దీనిపై చాలా స్పష్టంగా చెప్పారని సీఈవో వెల్లడించారు. కెప్టెన్, వైస్-కెప్టెన్ నియామకాల గురించి మాట్లాడదామన్నారన్నారు. అయితే నిర్ణయం మాత్రం కోచ్, కెప్టెన్ కు వదిలివేద్దామన్నారని పేర్కొన్నారు. వారు నిర్ణయించి తనకు సమాచారం ఇస్తారని చెప్పారన్నారు. ఆపై తాను అందరికీ తెలియజేస్తానని చెప్పారని వెల్లడించారు. అప్పటివరకూ అంతా మౌనంగా ఉండాలని చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications