టీ20ల్లో అదరగొట్టాడు.. ఇప్పుడు రెడ్ బాల్‌లోనూ రచ్చ చేయనున్న బుడ్డోడు!
Duleep Trophy 2026: భారత దేశీయ క్రికెట్ సీజన్‌కు నాంది పలుకుతూ 2026-27 దులీప్ ట్రోఫీ ఆదివారం (ఆగస్టు 23) బెంగళూరులో ఘనంగా ప్రారంభం కానుంది. బెంగళూరులో ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక రెడ్-బాల్ టోర్నీలో యువ ప్రతిభతో పాటు సీనియర్ ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి
ఈ సారి దులీప్ ట్రోఫీ టోర్నీలో 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఐపీఎల్, అంతర్జాతీయ టీ20 సిరీస్‌లలో సత్తా చాటిన ఈస్ట్ జోన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ఇషాన్ కిషన్ సారథ్యంలో నార్త్ ఈస్ జోన్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నాడు. టీ20ల్లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ రెడ్-బాల్ క్రికెట్ నిజమైన పరీక్షగా మారనుంది. రంజీ ఫార్మాట్లో ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌ల్లో 17.25 సగటు మాత్రమే ఉన్న నేపథ్యంలో మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొంది తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు.

ఫార్మాట్ మార్పులు
గత 2024-25 సీజన్లో దులీప్ ట్రోఫీని నాలుగు జట్ల ఫార్మాట్లో నిర్వహించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో పోటీ వాతావరణం కనిపించలేదు. దీంతో బీసీసీఐ మునుపటి ఇంటర్-జోనల్ ఫార్మాట్ ను పునరుద్ధరించింది. రాబోయే రోజుల్లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపికలో ఈ టోర్నమెంట్ కీలక పాత్ర పోషించనుంది.
జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్ల చారిత్రాత్మక మైలురాయి
చారిత్రాత్మకంగా నార్త్ జోన్ జట్టులో ఢిల్లీ, పంజాబ్ ఆటగాళ్లదే ఆధిపత్యం ఉండేది. అయితే ఈ ఏడాది మార్పిలో జమ్మూకాశ్మీర్ తొలిసారిగా రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంతో సమీకరణాలు మారిపోయాయి. కెప్టెన్ కన్హయ్య వధావన్, ఫైనల్లో అజేయంగా 160 పరుగులు చేసిన ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్, బౌలర్లు సునీల్ కుమార్, యుధ్వీర్ సింగ్‌లతో సహా ఆరుగురు జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్లు నార్త్ జోన్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.
సీనియర్ల రీ-ఎంట్రీ పోరాటం
గాయాల వల్ల సుదీర్ఘ కాలం టెస్ట్ జట్టుకు దూరమైన మహమ్మద్ షమీ(35) గత రంజీ సీజన్లో 37 వికెట్లతో చెలరేగి తిరిగి జట్టులోకి రావడం కోసం సిద్ధమయ్యాడు. అలాగే రంజీలో 156 బంతుల్లోనే 222 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన పృథ్వీ షా తన ఫామ్ ను కొనసాగించి జాతీయ జట్టు తలుపు తట్టాలని భావిస్తున్నాడు. ఇక శ్రీలంక పర్యటన ముగించుకుని వచ్చే సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ తరఫున సెమీస్ మ్యాచుల్లో బరిలోకి దిగి టెస్టుల్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తున్నాడు.
దులీప్ ట్రోఫీ షెడ్యూల్
క్వార్టర్-ఫైనల్: ఈస్ట్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్, ఆగస్టు 23 నుంచి, బెంగళూరు
క్వార్టర్-ఫైనల్: నార్త్ జోన్ వర్సెస్ వెస్ట్ జోన్, ఆగస్టు 23 నుండి, బెంగళూరు
మొదటి సెమీ-ఫైనల్: సెంట్రల్ జోన్ వర్సెస్ TBA, ఆగస్టు 30 నుండి, బెంగళూరు
రెండవ సెమీ-ఫైనల్: సౌత్ జోన్ వర్సెస్ TBA, ఆగస్టు 30 నుండి, బెంగళూరు
ఫైనల్: సెప్టెంబర్ 6 నుంచి, చెన్నై













Click it and Unblock the Notifications