నార్వే చెస్‌లో ప్రజ్ఞానంద విశ్వరూపం.. గౌతమ్ అదానీ ఫిదా!
భారత చెస్ రంగంలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడింది. యువ సంచలనం భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద రికార్డును కైవసం చేసుకున్నాడు. అదానీ స్పోర్ట్స్‌లైన్ "గర్వ్ హై" అథ్లెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ మద్దతుతో బరిలోకి దిగిన ఈ 20 ఏళ్ల చెస్ మేధావి, ప్రపంచ స్థాయి ఆటగాళ్లను మట్టికరిపించి ఈ చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఓస్లోలో జరిగిన ఈ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్.. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ గుకేష్ డి, అలీరెజా ఫిరౌజా, వెస్లీ సో, విన్సెంట్ కైమర్ వంటి దిగ్గజాలు బరిలో నిలిచారు. ఇంతటి బలమైన పోటీ ఉన్నప్పటికీ.. ప్రజ్ఞానంద అసాధారణమైన వ్యూహాత్మక నైపుణ్యంతో, మానసిక దృఢత్వంతో టోర్నమెంట్ అంతటా ఆధిపత్యం చెలాయించాడు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ప్రయాణంలో ప్రపంచ అత్యుత్తమ ఆటగాడైన మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించడం, అలాగే క్లాసికల్ ఫార్మాట్‌లో గుకేష్‌పై విజయం సాధించడం ప్రజ్ఞానంద ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

తీవ్ర ఉత్కంఠ రేపిన చివరి రౌండ్లో ప్రజ్ఞానంద తోటి భారతీయ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసితో తలపడ్డాడు. క్లాసికల్ గేమ్‌ను డ్రాగా ముగించిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాత జరిగిన ఆర్మగెడాన్ టైబ్రేక్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ ఫలితంతో పాటు ఇతర బోర్డులపై వచ్చిన సమీకరణాల ఆధారంగా ప్రజ్ఞానంద పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్ ట్రోఫీని ముద్దాడాడు. అంతర్జాతీయ చెస్ క్యాలెండర్‌లో "చెస్ వింబుల్డన్" గా పిలవబడే నార్వే చెస్‌లో ఇప్పటివరకు ఏ భారతీయుడు సాధించని ఘనతను ప్రజ్ఞానంద సాధించడం విశేషం.
ప్రజ్ఞానంద సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పందిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చెస్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఈ టోర్నమెంట్‌లో గెలవడం అనేది ఓర్పు, మేధస్సు మరియు పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లను ఎదుర్కొని ప్రజ్ఞానంద సాధించిన ఈ విజయం భయమెరుగని, లక్ష్యంపై దృష్టి పెట్టే సరికొత్త భారతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. అలాగే, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ మాట్లాడుతూ.. ఇది భారతీయ క్రీడారంగానికి గర్వకారణమైన క్షణమని, దేశంలోని కోట్లాది మంది యువతీ యువకులకు ప్రజ్ఞానంద ప్రయాణం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications