ఛాన్స్ కొట్టిన హార్దిక్ పాండ్యా
Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది భారత జట్టు. సీనియర్ ప్లేయర్లందరూ రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. జూనియర్లతో కూడిన మరో టీమ్ ఇటీవలే జింబాబ్వే పర్యటనలో ఉంది. 4-1 తేడాతో టీ20 సిరీస్‌లో జెండా ఎగురవేసింది. త్వరలో స్వదేశానికి రానుందా జట్టు.
జింబాబ్వే పర్యటన తరువాత పూర్తిస్థాయి ప్లేయర్లతో కూడిన జట్టు.. శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. మూడు చొప్పున టీ20 ఇంటర్నేషనల్స్, వన్డే సిరీస్‌లో తలపడుతుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 27వ తేదీన సాయంత్రం 7 గంటలకు పల్లెకెలెలో ప్రారంభమౌతుంది. ఈ నెల 28, 30 తేదీలతో జరిగే మ్యాచ్‌లో టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ ముగుస్తుంది.

ఆ వెంటనే- వన్డే సిరీస్ మొదలవుతుంది. 2, 4, 7 తేదీల్లో మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం దీనికి వేదిక. ప్రస్తుతం ఈ రెండు ఫార్మట్లల్లోనూ దూకుడు మీద ఉంది టీమిండియా. ఈ రెండు సిరీస్‌లల్లో ఆడే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇది- టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు తొలి సిరీస్ అవుతుంది. కాగా- టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కేప్టెన్‌గా వ్యవహరించడం దాదాపుగా ఖాయమైంది. ఈ ఫార్మట్‌కు నాయకత్వాన్ని వహిస్తూ వస్తోన్న రెగ్యులర్ కేప్టెన్ రోహిత్ శర్మ.. టీ20ల నుంచి రిటైర్మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ స్థానాన్ని హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వన్డే ఇంటర్నేషనల్స్‌కు మాత్రం మరో కేప్టెన్‌ను వెదుక్కోవాల్సి ఉంటుంది బీసీసీఐకి. వ్యక్తిగత కారణాలతో వన్డే సిరిస్‌కు దూరంగా ఉంటానంటూ హార్దిక్ పాండ్యా ఇప్పటికే బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే తాను స్వదేశానికి వెళ్తాననీ చెప్పాడు. దీనికి బీసీసీఐ అంగీకరించింది.
కాగా- వన్డే సిరీస్‌లో ఆడబోయే జట్టుకు సారథ్యాన్ని ఎవరికి అప్పగించాలనే విషయంపై బీసీసీఐ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లేదా డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పేర్లను దీనికోసం పరిశీలిస్తోన్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపొచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications