హార్దిక్ పాండ్యా చేసిన అతిపై సీరియస్.. !!
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి కప్పును ముద్దాడింది. ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ అయిదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫైనల్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు గానీ, టోర్నమెంట్ మొత్తం మీద మెరుపులు మెరిపించాడు. భారత్ విజయం తర్వాత.. అతని ఆనందానికి హద్దులేకుండా పోయింది. జాతీయ పతకాన్ని కప్పుకొని గ్రౌండ్ మొత్తం కలియదిరిగాడు. ప్రియురాలు మహికా శర్మతో కలిసి కనిపించాడు. ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుని ప్రేమను కురిపించాడు. ఆమెతో కలిసి స్టెప్పులు వేశాడు. ఆ సమయంలో అతను జాతీయ పతాకాన్ని ధరించాడు.

ఇప్పుడు అదే అతనికి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. జాతీయ జెండాను అగౌరవపరిచాడనే ఆరోపణలపై బెంగళూరులోని శివాజీ నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదును పూణేకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ బిద్కర్ దాఖలు చేశారు. విజయోత్సవ వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, పాండ్యా జాతీయ జెండాను భుజంపై కప్పుకుని డాన్స్ చేయడం, గెంతడం కనిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ప్రియురాలితో కలిసి స్టేజ్‌పై పడుకుని ఉండగా, అతని భుజంపై జెండా అలానే ఉందని, ఇది జాతీయ పతాకాన్ని కించపరిచినట్టేనని ఆరోపించారు. మహికా శర్మతో కలిసి డాన్స్ చేసేటప్పుడు గానీ, స్టేజీపై పడుకున్నప్పుడు గానీ హార్దిక్ పాండ్యా వీపునకు జాతీయ జెండా కట్టి ఉందని ఆయన గుర్తు చేశారు. 1971 జాతీయ పతాక చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం అతని చర్యలు జాతీయ పతాకాన్ని అవమానించినట్టే అవుతుందని వాజిద్ ఖాన్ తెలిపారు.
ఈ ఘటనపై బెంగళూరు శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, సంఘటన తమ పరిధిలోకి రాదని మొదట చెప్పిన పోలీసులు, జాతీయ జెండా మొత్తం దేశానికి ప్రతీక కావడంతో ఫిర్యాదును స్వీకరించారని వివరించారు. దీనిపై పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సి ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications