వీడియో: భావోద్వేగం- పిచ్‌ను గుండెలకు హత్తుకున్న కేఎల్ రాహుల్
KL Rahul: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయాన్ని సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను మట్టికరిపించింది. టీమిండియా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని కొట్టి అవతల పడేశారు బ్లాక్ క్యాప్స్. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది.
36 సంవత్సరాల తరువాత భారత్‌లో భారత్‌పై టెస్ట్ మ్యాచ్ గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి. చివరిసారిగా 1988లో వాంఖెడే స్టేడియంలో టెస్టుల్లో భారత్‌ను ఓడించింది న్యూజిలాండ్. అంతకుముందు 1969లో ఓ మ్యాచ్ గెలిచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్‌పై స్వదేశంలో గెలవడం మొత్తంగా ఇది మూడోసారి.

మూడు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యతను సాధించింది. రెండో టెస్ట్ ఈ నెల 24వ తేదీన పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభమౌతుంది. చివరి గేమ్ నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. ఈ రెండింటినీ గెలుచుకుంటేనే సిరీస్ భారత్ వశమౌతుంది.
మొత్తంగా 107 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది టీమిండియా. చివరి రోజున మధ్యాహ్న భోజన విరామ సమయం కంటే ముందే దీన్ని కొట్టేశారు కివీస్ బ్యాటర్లు. జట్టు ఖాతా తెరవకముందే ఓపెనర్ టామ్ లాథమ్, 35 పరుగుల వద్ద డెవాన్ కాన్వే అవుట్ కావడంతో ఇండియా క్యాంప్‌లో ఆశలు సజీవంగా నిలిచినప్పటికీ.. అది నీరుగారడానికి ఎంతో సేపు పట్టలేదు.
తొలి ఇన్నింగ్ సెంచరీ హీరో రచిన్ రవీంద్ర, మరో ఓపెనర్ విల్ యంగ్ భారత బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. సమయానుకూలంగా భారీ షాట్ల ఆడారు. రచిన్ రవీంద్ర ఆరు ఫోర్లతో 39, విల్ యంగ్ ఒక సిక్సర్, ఏడు ఫోర్లతో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు కేఎల్ రాహుల్. అతని హోమ్ పిచ్ కూడా ఇదే. అయినప్పటికీ- తన స్థాయికి తగ్గ ఆటతీరును కనపర్చలేకపోయాడు. తొలి ఇన్నింగ్‌లో ప్లేయర్లందరితో పాటు అతనూ చేతులెత్తేశాడని సర్ది చెప్పుకొన్నా.. రెండో ఇన్నింగ్‌లో విఫలం కావడం మాత్రం అతని స్వయంకృతాపరాధంగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే- అప్పటికి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది పిచ్. ఓపెనర్ల, టాప్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్- 35, కేప్టెన్ రోహిత్ శర్మ- 52, విరాట్ కోహ్లీ- 70, సర్ఫరాజ్ ఖాన్- 150, రిషభ్ పంత్- 99..ఇలా భారీ స్కోర్లను సాధించారు. కివీస్ బౌలర్ల దూకుడును అడ్డుకోగలిగారు.
రిషభ్ పంత్ అవుట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ ఏ మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. 12 పరుగులకే అవుట్ అయ్యాడు. అతని వికెట్ పడిన తరువాత భారత ఇన్నింగ్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. జట్టు స్కోర్ 438 పరుగుల కేఎల్ రాహుల్ కాగా- ఆ తరువాత 22 పరుగుల తేడాతో చివరి అయిదు వికెట్లను జట్టు కోల్పోయింది. ఫలితంగా భారీ స్కోర్‌ను ప్రత్యర్థికి నిర్దేశించలేకపోయింది.
In all probabilities KL Rahul played his last test match today.
— Jay Shah (@Jay_sha_h) October 20, 2024
Go well in ODIs n T20Is 👍🏻
Thank you KL Rahul !!#INDvsNZ #KLRahul pic.twitter.com/Jzmoz7vbMW
మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ భావోద్వేగానికి గురయ్యాడు. తన సొంత పిచ్‌పై రాణించలేకపోవడం పట్ల షాక్‌కు గురైనట్లు కనిపించాడు. అతనికి బాగా అచ్చొచ్చిన పిచ్ అయినప్పటికీ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోవడం పట్ల గిల్టీగా ఫీల్ అయ్యాడు. భావోద్వేగంతో పిచ్‌ను కుడి చేత్తో తాకి గుండెలకు హత్తుకున్నాడు. గ్రౌండ్‌పై ఉన్న తన భక్తిభావాన్ని చాటుకున్నాడు.












Click it and Unblock the Notifications