India-Pakistan Match: 34 వేల టికెట్లు-క్యూలో 84 లక్షల ఫ్యాన్స్..! ఫైనల్ కూడా బలాదూర్..!
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా గతంలో ఉన్న ఊపు లేదనే వాదన వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ తో ఏ మ్యాచ్ ఆడినా భారత్ విజేతగా నిలుస్తుండటంతో ఈ మ్యాచ్ లు ఏకపక్షంగా మారాయన్న చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా-జింబాబ్వే వేదికగా జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ లో మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ (India-Pakistan World Cup
Match) క్రేజ్ మామూలుగా లేదు. ఈ మ్యాచ్ కు లభిస్తున్న ఆదరణ చూసి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోతోంది.
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ లో వచ్చే ఏడాది అక్టోబర్ 10న జరగబోయే ఈ మ్యాచ్ కు ఏడాది ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ స్టేడియంలో ఉన్నవి కేవలం 34 వేల సీట్లే. అయితే వీటి కోసం వచ్చిన దరఖాస్తులు చూస్తే కళ్లు తేలేయాల్సిందే. ఏకంగా 84 లక్షల మంది ఇప్పటివరకూ ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారని బీబీసీ నివేదించింది. దీంతో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ క్రేజ్, అందులోనూ వరల్డ్ కప్ మ్యాచ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్దమవుతోంది.

ఐసీసీ లెక్కల ప్రకారం ది వాండరర్స్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రస్తుతం కొనసాగుతున్న టిక్కెట్ బ్యాలెట్ ద్వారా 83,97,294 దరఖాస్తులు అందాయని తెలిపింది. వాస్తవానికి నవంబర్ 21న ది వాండరర్స్ స్టేడియంలోనే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. దీని కోసం ఇప్పటివరకూ 79,00,944 టిక్కెట్ అభ్యర్థనలు మాత్రమే వచ్చాయని ఐసీసీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ కన్నా భారత్ -పాక్ మ్యాచ్ కే ఎక్కువ ఆదరణ ఉందని అర్థమవుతోంది. భారత్, పాకిస్తాన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల నుంచి 12 కోట్ల టికెట్ల కోసం అభ్యర్ధనలు వచ్చాయి. ఇందులో 84 లక్షల మంది ఒక్క భారత్-పాక్ మ్యాచ్ కోసమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిని ర్యాండమ్ గా ఎంపిక చేసి టికెట్లు ఖరారు చేయబోతున్నారు.














Click it and Unblock the Notifications
