ఆరంభం అద్దిరిపోవాలబ్బా: ఆసియా కప్ లో తొలి మ్యాచ్: తుదిజట్టు అంచనాలు ఇవే
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరగనుంది. ఆతిథ్య దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఢీ కొట్టబోతోంది భారత్. ఈ రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. భారత కాలమానం ప్రకారం.. ఈ రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం దీనికి వేదిక. పసికూన కావడంతో టీమిండియా గెలుపు దాదాపు ఖాయమే అయినప్పటికీ- ఈ నెల 14న పాకిస్తాన్ తో మ్యాచ్ ఉన్నందున ప్లేయర్లు ఎలా ఆడతారనేది ఆసక్తి రేపుతోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది భారత్. ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఈ కప్ ను సొంతం చేసుకుంది. తొమ్మిదోసారి జయకేతనాన్ని ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్ లో ఎదుర్కొనబోతోంది యూఏఈ కావడం వల్ల తుదిజట్టులో కొన్ని ప్రయోగాలు చేయొచ్చు. జూనియర్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది టీమ్ మేనేజ్మెంట్. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాలను పక్కన పెట్టొచ్చు.

శివమ్ దూబే, రింకూ సింగ్‌లలో మిడిల్ ఆర్డర్ స్థానానికి ఎవరు ఎంపికవుతారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ మ్యాచ్ లో డాషింగ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్ ను ఆరంభించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా వీరిద్దరూ నెట్ సెషన్స్ లో చెమటోడ్చారు. మంచి టైమింగ్ తో భారీ షాట్లు ఆడారు. ప్రత్యేకించి- అభిషేక్ శర్మ. ఈ సెషన్‌లో అతను 25 నుంచి 30 సిక్సర్లు బాదాడు.
తిలక్ వర్మ మూడో స్థానంలో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. శివమ్ దూబే బౌలింగ్ ఆప్షన్‌గా కూడా అందుబాటులో ఉండటంతో, అతను యూఏఈతో జరిగే మ్యాచ్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్‌లో ఆడే సంజు శాంసన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవచ్చు. వికెట్ కీపింగ్ బాధ్యతలను జితేష్ శర్మ చేపట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించాడు జితేష్. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆల్ రౌండర్ల విషయానికి వస్తే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆడొచ్చు. బౌలింగ్ విభాగంలో జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలో దిగుతాడు. కుల్ దీప్ యాదవ్‌కు కూడా తుది జట్టులో చోటు కల్పించాల్సి వస్తే ఓ ఆల్ రౌండర్ ఆప్షన్‌ను జట్టు వదులుకోవాల్సి వస్తుంది. అతన్ని జట్టులోకి తీసుకుంటే అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం కావొచ్చు.
ఆసియా కప్ 2025లో యూఏఈతో జరిగే తొలి మ్యాచ్ లో- అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కేప్టెన్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications