టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు-ఛాంపియన్స్ ట్రోఫీ వేళ షాక్..!
వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. ఇందులో పాల్గొనే దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాలు కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిధ్యమిస్తోంది. అయితే పాకిస్తాన్ లో మ్యాచ్ లు ఆడేందుకు భారత్ నిరాకరించడంతో తటస్థ వేదికగా దుబాయ్ కూడా వచ్చి చేరింది. దీంతో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయించింది.
అయితే పాకిస్తాన్ లో మ్యాచ్ లు ఆడేందుకు భారత్ సిద్దంగా లేకపోవడంతో దుబాయ్ లో జరిగే మ్యాచ్ ల్లో మాత్రమే టీమిండియా ఆడబోతోంది. కానీ టీమిండియా ఆటగాళ్లకు ఇచ్చిన మ్యాచ్ జెర్సీలపై మాత్రం పాకిస్తాన్ పేరు కూడా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిధ్య దేశం కావడంతో ఇలా పాకిస్తాన్ పేరు కూడా ముద్రించారు. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్ లో టీమిండియా మ్యాచ్ లు ఆడకపోయినా ఆ పేరు ఎలా ముద్రిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీనిపై పీసీబీ అధికారి ఒకరు ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పందించారు. టీమ్ ఇండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరును ముద్రించడానికి నిరాకరించడం ద్వారా బీసీసీఐ 'క్రికెట్‌లో రాజకీయాలు' తీసుకువస్తోందని ఆరోపించారు. గతంలో, ఛాంపియన్స్ ట్రోఫీకి కర్టెన్ రైజర్ ఈవెంట్ అయిన కెప్టెన్ల మీట్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మను పాకిస్తాన్‌కు పంపడానికి భారత బోర్డు నిరాకరించింది. ఇప్పుడు ఇలా చేస్తోందని, ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదని తెలిపారు. భారత జట్టు పాకిస్తాన్‌కు రావడానికి నిరాకరించిందని, తమ కెప్టెన్‌ను (పాకిస్తాన్‌కి) ప్రారంభ వేడుకలకు పంపడానికి ఇష్టపడటం లేదని, ఇప్పుడు తమ జెర్సీపై ఆతిథ్య దేశం (పాకిస్థాన్) పేరును ముద్రించకూడదని అంటున్నారని పీసీబీ అధికారి వ్యాఖ్యానించారు. ఐసీసీ దీన్ని ఒప్పుకోదని, పాకిస్తాన్ వాదనకే మద్దతిస్తుందని పీసీబీ అధికారి ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications