టీమిండియా ఫేట్ మార్చిన వీవీఎస్: గంభీర్ కు ది బెస్ట్ ఆల్టర్నేటివ్ దొరికినట్టే
జింబాబ్వేతో చివరి టీ20 మ్యాచ్‌లో భారత యువ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ అయింది. 15 ఏళ్ల వయసులోనే మెరుపులు మెరిపిస్తోన్న భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి జట్టు విజయంలో కీలకంగా మారాడు. జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు.
టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ 49 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. సూర్యవంశీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

భారత తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన సూర్యవంశీకి ఈ పర్యటన లైఫ్ టైమ్ మెమరీ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లో 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్ ను అందుకున్న ఈ యువ బ్యాటర్.. చివరి గేమ్ లోనూ అదే రేంజ్ రెచ్చిపోయాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. అభిషేక్ శర్మ- 2 పరుగలతో మరోసారి విఫలం అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్- 27, ఇషాన్ కిషన్- 29, రింకూ సింగ్- 25 పరుగులతో ఫర్వాలేదనిపించుకున్నారు.
లక్ష్య చేధనలో దిగిన జింబాబ్వే జట్టు ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయింది. తీవ్ర ఒత్తిడికి గురైంది. డాషింగ్ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్, స్టార్ ఆల్ రౌండర్ సికందర్ రజా ఇద్దరూ డకౌట్ కావడం శాపంగా మారింది. ర్యాన్ బర్ల్ 54 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగుల వద్ద చతికిలపడింది జింబాబ్వే. అయిదో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ర్యాన్ బర్ల్.
ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లాండ్ లతో జరిగిన టీ20 సిరీస్ లల్లో వరుస ఓటములను చవిచూసింది టీమిండియా. ఐర్లాండ్, ఇంగ్లాండ్ లల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. జింబాబ్వేలో అడుగు పెట్టేసరికి తలరాత మారిపోయింది. ఒక్కసారిగా ట్రాక్ ఎక్కింది. మొదటి మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. రెండో మ్యాచ్ లో ఏకంగా 90 పరుగుల తేడాతో జింబాబ్వేను మట్టికరిపించింది.
ఈ సిరీస్ కు గౌతమ్ గంభీర్ కు బదులుగా వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గంభీర్ కోచ్ గా వ్యవహరించిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ లల్లో వరుసగా రెండు టీ20 సిరీస్ లనూ కోల్పోయిన నేపథ్యంలో అతనికి ఆల్టర్నేటివ్ గా కనిపించాడు వీవీఎస్. ఈ సిరీస్ కు అతన్ని హెడ్ కోచ్ గా జింబాబ్వేకు పంపించింది బీసీసీఐ. ఈ మార్పు తిరుగులేని విజయాన్ని అందించింది టీమిండియాకు.
కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ లల్లో ఓటమితో డీలా పడ్డ జట్టులో వీవీఎస్ లక్ష్మణ్ నూతనోత్తేజాన్ని ఇచ్చాడని వ్యాఖ్యానించాడు. ప్రతి ప్లేయర్ ను కూడా మోటివ్ చేయగలిగారని, ఈ సిరీస్ విజయంలో హెడ్ కోచ్ పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications