IND vs IRE: వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే?
IND vs IRE: భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. అయితే టాస్ అనంతరం శ్రేయస్ అయ్యర్ భారత తుది జట్టును ప్రకటించినప్పుడు అందులో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు లేకపోవడం అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి, నిరాశకు గురిచేసింది. ఈ మొదటి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని అభిమానులు అంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు.
ఐపీఎల్‌లో మెరిసినా దక్కని అవకాశం!
ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ పర్యటనలో చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే వైభవ్ సూర్యవంశీకి మొదటి టీ20లోనే ఆడే అవకాశం ఎందుకు రాలేదనే విషయమై టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. "దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేకపోయాం. వైభవ్ నిజంగా ఒక అసాధారణమైన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మా స్క్వాడ్‌లో ఇప్పటికే భారత్ తరఫున గత కొన్ని సిరీస్‌లుగా అత్యుంత అద్భుతంగా రాణించిన ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు" అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.

సీనియర్లకే ప్రాధాన్యత
జట్టు ఎంపిక వెనుక ఉన్న కారణాలను శ్రేయస్ అయ్యర్ మరింత వివరిస్తూ.. "ఈ సీజన్ అంతటా నిలకడగా రాణిస్తూ వస్తున్న మా సీనియర్ క్రికెటర్లకే ప్రస్తుతానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. లెగ్ స్టంప్ వెలుపల వచ్చే బంతులను ఎంతో చాకచక్యంగా ఆడే ఈ యువ ఆటగాడికి (వైభవ్‌కు) భవిష్యత్తులో సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. అయితే ప్రస్తుత మ్యాచ్ వ్యూహం ప్రకారం.. మేము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు (సీమర్లు), ఒక ఆల్‌రౌండర్, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం" అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.
గౌతమ్ గంభీర్ సందేశం.. దూకుడుగా ఆడటమే లక్ష్యం!
ఈ సిరీస్ కోసం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టుకు ఇచ్చిన సందేశం గురించి శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "గంభీర్ భాయ్ ఆటగాళ్లందరినీ మైదానంలో స్వేచ్ఛగా ఉంటూనే, తమ ఆటలో అత్యంత కఠినంగా , కనికరం లేకుండా దూకుడుగా వ్యవహరించాలని కోరారు. దీని కోసం నేను ఇంకా ఎన్నో పదాలను ఉపయోగించవచ్చు. కానీ మాలో చాలా మందికి ఇది ఇక్కడ మొదటిసారి కాబట్టి, పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటు పడటం ముఖ్యం. నిన్న మాకు అద్భుతమైన ప్రాక్టీస్ సెషన్ లభించింది, ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో, ఉత్సాహంగా ఉన్నారు" అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.












Click it and Unblock the Notifications