ఐపీఎల్ 2024పై బిగ్ స్టేట్‌మెంట్
IPL 2024: ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. మార్చి చివరి వారంలో ఈ సీజన్ ఆరంభం కానుంది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది.
ఐపీఎల్ ఆడే అన్ని జట్లు కూడా సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో జరిగిన వేలం పాట తరువాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది ప్లేయర్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడబోతోన్నారు. కొత్త సారథులు వచ్చారు. ఓ మోస్తరు ప్లేయర్లు భారీ రేటు పలికారు. మరికొందరు స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగిలారు.

ఈ సారి ఐపీఎల్ టోర్నమెంట్.. లోక్‌సభ ఎన్నికల వేడి మధ్య కొనసాగబోతోంది. ఈ రెండూ ఒకేసారి షెడ్యూల్ కావడం దాదాపుగా ఖాయమైంది. మార్చి మూడోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడొచ్చు. దీని తరువాత దేశం మొత్తం కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతుంది.
ఎన్నికల ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ, అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి భారీగా భద్రత సిబ్బందిని ఉపయోగించాల్సి ఉంటుంది. అదే మార్చి చివరి వారంలో ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఆరంభం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు ఎన్నికల సందడి, ఇటు ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల నిర్వహణ అనేది కత్తి మీద సాములాంటిదే.
ప్రతి స్టేడియం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు, భద్రత సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. ఆటగాళ్లకూ అదే స్థాయిలో భద్రతను కల్పించాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికల విధి నిర్వహణల్లో ఉండే పోలీసు, భద్రత సిబ్బందికి ఇది కొంత ఆటంకంగా కలిగించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ పరిణామాలపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం మార్చి చివరి వారంలో ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఆరంభమౌతుందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ వేదికలపై నిర్వహించాలనే ఆలోచన చేయట్లేదని అన్నారు. ప్రత్యామ్నాయ వేదికలను చూడట్లేదని, భారత్‌లోనే ఐపీఎల్ 2024ను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండు విడతల్లో ఐపీఎల్ టోర్నీని నిర్వహించే అవకాశాలు లేకపోలేదని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. దీనిపై వర్కవుట్ చేస్తోన్నామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తొలి సగం మ్యాచ్‌లు, ఆ తరువాత చివరి సగం మ్యాచ్‌లను నిర్వహించాలనే ప్రతిపాదన ఉందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత.. ఫిక్స్చర్స్‌పై దృష్టి పెడతామనీ అరుణ్ ధుమాల్ చెప్పారు. ఎన్నికలు జరిగే సమయంలో- ఏ స్టేడియంలో ఏ మ్యాచ్ జరుగుతుందనేది ఇంకా తేలాల్సి ఉందని, ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత.. దానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications