IPL 2024: ఎంఎస్ ధోనీ సంచలన రికార్డు-ఏకంగా 150తో టాప్ లో..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న ధోనీ.. ఇప్పుడు మరో రికార్డు సాధించాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై విజయంతో ధోనీకి ఈ అరుదైన రికార్డు దక్కింది. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర ఆటగాడికీ లభించని 150 విజయాల రికార్డు మహీకి సొంతమైంది.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా అత్యధిక మ్యాచ్ విజయాల్లో భాగస్వామి అయిన అరుదైన రికార్డు ధోనీకి సొంతమైంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయం ధోనీకి ఈ రికార్డును అందించింది. మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పటివరకూ అత్యధికంగా 150 జట్టు విజయాల్లో భాగస్వామిగా నిలిచాడు. ఇలా ఓ ఆటగాడు 150 మ్యాచ్ విజయాల్లో భాగస్వామిగా ఉండటం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.

ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత స్ధానంలో సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (133), ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (133), ఆర్సీబీ కీపర్ దినేష్ కార్తీక్ (125), చెన్నై మాజీ ప్లేయర్ సురేష్ రైనా (122 ) ఉన్నారు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీకి ఇప్పటికే 133 విజయాలతో అత్యధిక ఐపీఎల్ మ్యాచ్ విజయాలు అందించిన కెప్టెన్ రికార్డు ఉంది. ధోనీ తర్వాతి స్ధానంలో రోహిత్ శర్మకు 87 విజయాల రికార్డు ఉంది. దీంతో ధోనీకి వ్యక్తిగతంగానూ, కెప్టెన్ గానూ అరుదైన రికార్డు సొంతమైనట్లయింది.
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకూ ఐపీఎల్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ 259 మ్యాచ్ లు ఆడాడు. అలాగే ఐపీఎల్ లో తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా ఐదు టైటిల్స్ కూడా అందించిన ధోనీ.. రోహిత్ శర్మ (5)తో కలిసి ఈ రికార్డులో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కు టైటిల్ అందిస్తాడని భావించినా టోర్నీ ప్రారంభానికి ముందు అనూహ్యంగా తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్ కు పగ్గాలు అప్పగించాడు.
ఇక నిన్న జరిగిన మ్యాచ్ లోనూ ధోనీ చివరి ఓవర్లో బరిలోకి దిగి ఓ బౌండరీ బాదాడు. ఆ తర్వాత ఓ సింగిల్ తీసి స్ట్రైక్ మార్చేసాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 212 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ ముందు ఉంచింది. దీన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ పూర్తిగా విఫలమైంది. దీంతో హైదరాబాద్ పై 78 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది.












Click it and Unblock the Notifications