IPL 2026: బీసీసీఐలో ముస్తాఫిజుర్ రిలీజ్ చిచ్చు ? తెరవెనుక కీలక పరిణామం..!
భారత్-బంగ్లాదేశ్ మధ్య తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ కొనుక్కున్న బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఈ సీజన్ నుంచి తప్పించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నిర్ణయంపై ఇప్పటికే క్రికెట్ వర్గాలతో పాటు కోల్ కతా అభిమానులు సైతం మండిపడుతున్నారు. అంతే కాదు ఈ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు భారత్ లో ఆడకూడదని నిర్ణయించింది.
మరోవైపు ఈ సీజన్ కోసం 9.20 కోట్లు పెట్టి కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను అర్ధాంతరంగా తప్పించే విషయంలో బీసీసీఐలోనూ ఏకాభిప్రాయం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బీసీసీఐలో కొందరు పెద్దలు ఎవరి నుంచో అందిన సందేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో ఓ బోర్డు సభ్యుడి వెల్లడించారు. దీంతో ఇప్పటికే ఈ నిర్ణయం వెనుక కేంద్రం ఉందన్న ప్రచారానికి బలం చేకూరుతోంది.

ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ కాంట్రాక్ట్ నుండి రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్న సమావేశంలో బీసీసీఐ , ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులందరూ లేరని సదరు అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత నెలలో జరిగిన వేలంలో రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన ఎడమచేతి వాటం పేసర్‌ను విడుదల చేయాలనే నిర్ణయం బోర్డు అత్యున్నత స్థాయిలో తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. తమకు ఈ విషయం మీడియా ద్వారానే తెలిసిందని సదరు అధికారి తెలిపారు. దీనిపై బోర్డులో ఎటువంటి చర్చ జరగలేదని, తమ వైపు నుండి ఎటువంటి సూచన తీసుకోలేదని బోర్డు అధికారి వెల్లడించారు.

అయితే చివరికి ఈ నిర్ణయం మాత్రం అధికారికంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల కారణంగా, బీసీసీఐ తమ ఆటగాళ్ళలో ఒకరైన బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తమ జట్టు నుండి విడుదల చేయాలని ఫ్రాంచైజీ కేకేఆర్‌కు సూచించిందని ఆయన వెల్లడించారు. బీసీసీఐ నిర్ణయానికి ప్రతిస్పందనగా.. బంగ్లాదేశ్ ప్రభుత్వం తర్వాత నోటీసు వచ్చే వరకు దేశవ్యాప్తంగా ఐపీఎల్ ప్రసారాల్ని నిషేధించింది. దీంతో పాటు ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు తాము ఆడబోమని బీసీబీ తీసుకున్న నిర్ణయంతో బీసీసీఐ ఇరుకునపడాల్సి వస్తోంది.












Click it and Unblock the Notifications