LSG vs RR: కొంపముంచిన డకౌట్స్.. చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్!
LSG vs RR Turning Point: ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు మరో ఘోర పరాజయం ఎదురైంది. బుధవారం లక్నో వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. లక్నోకు ఇది వరుసగా నాలుగో పరాజయం కాగా.. ఐదో ఓటమి.
మరోవైపు రెండు పరాజయాల తర్వాత రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. రవీంద్ర జడేజా(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 43 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తే.. ముగ్గురు బ్యాటర్ల డకౌటవ్వడం లక్నో విజయవకాశాలను దెబ్బతీసింది.
ముగ్గురు డకౌట్..
160 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మిచెల్ మార్ష్(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఆయుష్ బదోని(0), రిషభ్ పంత్(0), ఎయిడెన్ మార్క్‌రమ్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరడం లక్నో పతనాన్ని శాసించింది. మిచెల్ మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్(22), హిమ్మత్ సింగ్(15) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/20) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(2/27), బ్రిజేష్ శర్మ(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.
అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 43 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/30), ప్రిన్స్ యాదవ్(2/29), మోహ్‌సిన్ ఖాన్(2/17) రెండేసి వికెట్లు తీసారు.
గేమ్ ఛేంజింగ్ బౌలింగ్..
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో నండ్రే బర్గర్ గేమ్ ఛేంజింగ్ బౌలింగ్ చేశాడు. లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌ను తన రెండో ఓవర్‌లోనే డకౌట్ చేసిన బర్గర్.. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన మిచెల్ మార్ష్‌ను క్యాచ్ ఔట్ చేసి లక్నో ఓటమిని శాసించాడు. మిచెల్ మార్ష్‌ను ఔట్ చేయకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ముఖ్యంగా లక్నో బ్యాటర్లలో ముగ్గురు బ్యాటర్లు డకౌటవ్వడం ఆ జట్టు ఓటమికి కారణమైంది.
ఆదుకున్న జడేజా..
110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్థాన్ రాయల్స్‌ను రవీంద్ర జడేజా ఆదుకున్నాడు. శుభమ్ దూబే(19 నాటౌట్) సాయంతో ఏడో వికెట్‌కు అజేయంగా 49 పరుగులు జోడించాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. జడేజా త్వరగా ఔటైనా.. విలువైన పరుగులు చేయకపోయినా.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.












Click it and Unblock the Notifications