MI vs CSK: ముంబై మునిగిందక్కడే.. సీఎస్‌కేకు అదిరిపోయే విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) రికార్డ్ విజయం నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని అందుకుంది. గురువారం వాంఖడే వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది ఐదో పరాజయం కాగా.. సీఎస్‌కేకు మూడో విజయం. సంజూ శాంసన్ అజేయ శతకం, అకీల్ హోసెన్(4/17) సెన్సేషనల్ బౌలింగ్ సీఎస్‌కేకు చారిత్రాత్మక విజయాన్ని అందించాయి.
సంజూ అజేయ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 నాటౌట్) ఒక్కడే అజేయ శతకంతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్(2/37), అల్లా ఘజన్‌ఫర్(2/25) రెండేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు
అనంతరం ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 5 ఫోర్లుతో 35), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లతో 37) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. డానిష్ మలెవర్(0), నమన్ ధీర్(0), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(0) డకౌట్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అకీల్ హోసెన్(4/17) నాలుగు వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా.. నూర్ అహ్మద్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ చౌదరీ, అన్షుల్ కంబోజ్, జెమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్ తలో వికెట్ తీసారు.

ముంబై కొంప మునిగిందక్కడే..
208 పరుగుల లక్ష్య ఛేదనలో తొలి ఓవర్ నుంచే ముంబై పతనం మొదలైంది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను సీఎస్‌కేకు అప్పగించింది. తొలి ఓవర్‌లోనే అకీల్ హోసేన్‌ను బరిలోకి దింపి రుతురాజ్ గైక్వాడ్ ఫలితాన్ని రాబట్టాడు.
డానిష్ మలేవార్(0)ను అకీల్ డకౌట్ చేయగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(7)ను ముఖేష్ చౌదరీ రెండో ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. మూడో ఓవర్‌లో నమన్ ధీర్(0)ను అకీల్ హోసేన్ డకౌట్ చేసి ముంబై పతనాన్ని శాసించాడు. మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో ముంబై బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దాంతో పవర్ ప్లేలో ముంబై 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులే చేసింది. ఇక్కడే మ్యాచ్ సీఎస్‌కే వశమైంది.
సూర్య, తిలక్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినా.. ఛేదించాల్సిన రన్‌రేట్ పెరగడంతో వారిపై ఒత్తిడి పెరిగింది. మిడిల్ ఓవర్లలో మరోసారి బౌలింగ్‌కు దిగిన అకీల్ హోసెన్ సూర్య, తిలక్ వర్మలను పెవిలియన్ చేర్చి సీఎస్‌కే విజయాన్ని ఖాయం చేశాడు. ఇతర బౌలర్లు మిగతా వికెట్లు తీసి సీఎస్‌కే విజయాన్ని పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications