ఈ డిసెంబర్ లోపే.. : తేల్చి చెప్పిన ధోనీ
వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్‌లో ఆడటంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ లో దాదాపుగా అన్ని మ్యాచ్ లకూ దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. తన భవిష్యత్ ప్రయాణంపై తేల్చి చెప్పారు. బెంగళూరులో శనివారం రాత్రి ఏర్పాటైన ఓ హెల్త్ కేర్ సెమినార్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడటంపై తేల్చి చెప్పారు.
ఈ ఏడాది డిసెంబర్ నెల లోపే ఐపీఎల్‌లో తన ప్రయాణానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని ధోనీ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి జాప్యం ఉండబోదనీ అన్నారు. రాబోయే ఐపీఎల్ లో ఆడాలా వద్దా అనేది పూర్తిగా ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ వంటి ఫాస్టెస్ట్ ఫార్మట్ ఆడటానికి తాను ఎంతవరకు ఫిట్‌గా ఉన్నాననేది మెడికల్ టీమ్ ఇచ్చే రిపోర్టుల ద్వారా అంచనా వేసుకుని డిసెంబర్ ఆక్షన్ నాటికి ఓ స్పష్టమైన నిర్ణయానికి వస్తానని పేర్కొన్నారు.

వయసు, శారీరక దారుఢ్యం గురించి సరదా వ్యాఖ్యలు చేశారాయన ఈ సందర్భంగా. తనను తాను ఓ పాత వింటేజ్ వెహికల్ గా అభివర్ణించుకున్నారు. ఈ పాత వింటేజ్ వాహనాన్ని మళ్ళీ పరిగెత్తేలా చేసే బాధ్యత పూర్తిగా డాక్టర్లపైనే ఉందని నవ్వుతూ చెప్పారు. ఫిట్ నెస్ కు సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తి చేసి మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మరో సీజన్ ఆడే ఆలోచన చేస్తానని స్పష్టం చేశారు. దీంతో తాను రాబోయే సీజన్ ఆడాలా వద్దా అనే ఒత్తిడి ఇప్పుడు డాక్టర్లపైనే ఉందంటూ ధోనీ చెప్పుకొచ్చారు.
మరోవంక.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధోనీ పునరాగమనంపై ఆశగా ఉంది. రాబోయే సీజన్ లో ఆడటంపై తుది నిర్ణయం ధోనీదే అయినప్పటికీ ఆయన ఎల్లో జెర్సీ ధరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. ధోనీ చెన్నైకి వచ్చిన తర్వాతే తమకు సమాచారం అందిస్తారని, ఓ ఆటగాడిగా ఆయన జట్టుతో కొనసాగుతారనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ధోనీ పిక్క గాయం కారణంగా మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. దీని తర్వాత సీఎస్‌కే యాజమాన్యం జట్టులో కీలక మార్పులు చేసింది. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరించాడు.














Click it and Unblock the Notifications
