భారత్- పాకిస్తాన్ మ్యాచ్: వీధుల్లో ఇక్కడ.. గ్రౌండ్ లో అక్కడ: దుమ్ము దులుపుడే
ఆసియా కప్ 2025లో భాగంగా రేపు భారత్-పాకిస్తాన్ మధ్య రేపు మ్యాచ్. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి.. ఈ రెండు జట్లు. ఈ నెల 10న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో శుభారంభం చేసింది టీమిండియా. అదే ఊపును పాకిస్తాన్ పైనా ప్రదర్శించడానికి ఉవ్విళ్లూరుతోంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుందనే అంచనాలు ఉన్న మ్యాచ్ ఇది.
అటు పాకిస్తాన్ కూడా ఆసియా కప్ లో బోణీ కొట్టింది. ఒమన్ పై దుమ్ము రేపింది. బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్ లో మాత్రం చెలరేగింది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఒమన్ ను జస్ట్.. 67 పరుగులకే కుప్పకూల్చింది. బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించుకుంది పాకిస్తాన్. ఆరుమంది బౌలింగ్ చేస్తే.. వాళ్లందరికీ వికెట్లు దక్కాయి. ఒక్కరు కూడా ఖాళీ చేతులతో మ్యాచ్ ను ముగించలేదు.

ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ను రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో పర్యాటకులపై మారణహోమానికి దిగిన పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడటం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని బాయ్ కాట్ చేయాలంటూ భారత్ లో పలువురు డిమాండ్ చేస్తోన్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడితే మృతుల కుటుంబాలను అవమానించినట్టే అవుతుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తోన్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. పాకిస్తాన్ క్రికెటర్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వాటిని నిలువనా తగులబెట్టారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఆందోళనలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ నాయత్వాన్ని వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తమ సింధూరం చెరిగిపోయిన భారత సైనికుల భార్యలను పాకిస్తానీ క్రికెటర్లు అపహాస్యం చేశారని ఆయన ఆరోపించారు. ఆ ఉగ్రదాడిలో దారుణంగా హత్యకు గురైనప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు సోషల్ మీడియాలో భారత్ ను కించపరిచారని గుర్తు చేశారు. తమ దేశ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ భారత మహిళల తలపై సింధూరం పెడుతున్నారని సిగ్గు లేకుండా పోస్ట్ చేశారని భరద్వాజ్ పేర్కొన్నారు. అలాంటి పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటానికి సిద్ధపడ్డామని, డబ్బు కోసం పిచ్చివాళ్ళం అయ్యామా?" అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications