భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ పై పాకిస్తాన్ బిగ్ యూటర్న్?
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్.. అనేక మలుపులు తిరుగుతోంది. ఈ నెల 15వ తేదీన కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్ ను ఢీ కొనాల్సి ఉంది పాకిస్తాన్. ఈ మ్యాచ్ ఆడబోమని ఇప్పటికే ప్రకటించింది పాకిస్తాన్. ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయానా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ తో మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పారు. ఇందులో ఎటువంటి మార్పూ ఉండబోదనీ అన్నారు.
ఆ తర్వాత- ఈ వ్యవహారంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఎంటర్ అయింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ ను నిర్వహిస్తోన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మ్యాచ్ రద్దయితే భారీ ఆర్థిక, పర్యాటక నష్టాలు వాటిల్లుతాయని పేర్కొంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు తమ దేశంలో అత్యంత ఆదరణ ఉంటుందని, ఇది రద్దయితే టికెట్లు అమ్ముడుపోవని, స్పాన్సరర్లు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ పరిణామం భారత్, శ్రీలంక క్రికెట్ బోర్డులకే కాకుండా టోర్నమెంట్ నిర్వాహకులు, ఆతిథ్య దేశ వాటాదారులకు కూడా గణనీయమైన ఆదాయ నష్టాలకు దారితీస్తుందని తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాసింది. హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ రిజర్వేషన్లు సైతం రద్దు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మ్యాచ్ నిర్వహణలో పాలుపంచుకునే స్థానిక లాజిస్టిక్స్, సర్వీస్ ప్రొవైడర్లు/ఆపరేటర్ల ఆదాయానికి గండిపడుతుందని తెలిపింది.
ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనుంది. ప్రభుత్వం, క్రికెట్ పరంగా శ్రీలంకతో పాకిస్తాన్ ఎప్పుడూ ఘర్షణ వైఖరికి దిగలేదని, సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తోన్నాయని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే శ్రీలంక బోర్డు పంపిన అభ్యర్థనను తిరస్కరించలేమని పేర్కొన్నాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా స్వయంగా పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీని సైతం సంప్రదించారు.
దీంతో నక్వీ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నాయి. కాగా- ఈ విషయంపై పాకిస్తాన్ క్రీడా మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించనున్నట్లు పీసీబీ వర్గాలు స్పష్టం చేశాయి. శ్రీలంక ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది ప్రభుత్వానికి వివరిస్తామని, ఏదేమైనప్పటికీ- ప్రభుత్వం తీసుకునేదే తుదినిర్ణయమౌతుందని పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications