Asia Cup 2025: అనూహ్య పరిణామాలు-యూఏఈతో మ్యాచ్ ఆలస్యం చేసిన పాక్ ..!
ఆసియా కప్ (Asia Cup 2025) లో భాగంగా భారత్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ప్రత్యర్థి ఆటగాళ్లు తమతో హ్యాండ్ షేక్ (చేతులు కలపడం) చేయలేదని, అందుకు కారణమైన రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని డిమాండ్ చేసిన పాకిస్తాన్ (pakistan team) ఐసీసీ వెనక్కి తగ్గకపోవడాన్ని అవమానంగా భావిస్తోంది. దీంతో ఎలాగైనా నిరసన తెలపాలని నిర్ణయించింది. దీంతో ఇవాళ యూఏఈ (UAE)తో పాకిస్తాన్ జరగాల్సిన మ్యాచ్ కు ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
హ్యాండ్ షేక్ వివాదానికి కారకుడైన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను ప్యానెల్ నుంచి తొలగించాలని, లేకపోతే తాము టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ యూఏఈతో జరగాల్సిన మ్యాచ్ కు రిఫరీ మార్పు ఉంటుందని భావించింది. అయితే ఐసీసీ నుంచి దీనిపై క్లారిటీ రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులకు దిగింది. ఇవాళ మ్యాచ్ కు పాక్ ఆటగాళ్లు చివరి నిమిషం వరకూ హాజరు కాకుండా హోటల్ రూమ్ లోనే ఉండిపోయారు.

దీంతో పాకిస్తాన్-యూఏఈ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. చివరి నిమిషంలో ఐసీసీ నుంచి ఒత్తిడి రావడంతో పీసీబీ ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన మొహసిన్ నక్వీ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇందులో ఇవాళ యూఏఈతో జరిగే మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమవుతుందంటూ ట్వీట్ చేశారు.

🚨Pakistan team has departed for the stadium. Best of luck boys🇵🇰🏏pic.twitter.com/CQNEM1edyQ
— Rayham (@RayhamUnplugged) September 17, 2025
అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు హోటల్ నుంచి బయలుదేరి బస్సులో స్టేడియానికి వెళ్లారు. దీంతో 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ కాస్తా 9 గంటలకు ప్రారంభించాలని ఆసియాకప్ నిర్వాహకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇలా పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా యూఏఈతో మ్యాచ్ ఆడకుండా ఆలస్యం చేయడానికి ఎవరు అనుమతించారన్న దానిపై వివాదం నెలకొంది. ఇవాళ మ్యాచ్ లో గెలిచే జట్టు సూపర్ 4లో భారత్ తో ఆడే అవకాశం ఉండటంతో ఈ పోరుపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications