పాకిస్తాన్ క్రికెట్ లో అనూహ్య పరిణామం.. !!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ టెస్ట్ ఫార్మట్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తోన్న మాజీ ఆల్ రౌండర్ అజర్ మహమూద్ పై వేటు పడింది. కాంట్రాక్ట్ గడువు ముగియక ముందే అతనికి ఉద్వాసన పలికింది బోర్డ్ మేనేజ్మెంట్. మూడు నెలలు ముందుగానే తప్పించింది. 2026 మార్చి వరకు టెస్ట్ మ్యాచ్ లు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ మీడియా చెబుతున్నప్పటికీ- ఛైర్మన్ నక్వీతో భేదాభిప్రాయాలే దీనికి కారణమని తెలుస్తోంది.
గత ఏడాది మార్చిలో టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు అజర్ మహమూద్. పీసీబీతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ హోదాలో కొనసాగాల్సి ఉంది. మూడు నెలలు ముందుగానే ఉన్నపళంగా అతన్ని తొలగించింది పీసీబీ. 2026 మార్చి నుంచి ఆరంభం కాబోయే టెస్ట్ సీజన్ కోసం ఇప్పటి నుంచే సమర్థుడైన హెడ్ కోచ్ ను అపాయింట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ లో కూడా మార్పులు ఉండొచ్చు.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్ తన ప్రయాణాన్ని మార్చి 2026లో ప్రారంభించనుంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. దీని తర్వాత జూలైలో వెస్టిండీస్, ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌లో ఆడుతుంది. నవంబర్-డిసెంబర్ లో శ్రీలంక, 2027 మార్చిలో న్యూజిలాండ్‌కు స్వదేశంలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీరిస్ లన్నింటినీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది పాకిస్తాన్. అజర్ మహమూద్ కంటే మెరుగైన హెడ్ కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టనుంది.
2024 ఆరంభంలో సెలక్షన్ విషయాలపై విభేదాల కారణంగా ఆస్ట్రేలియా కోచ్ జాసన్ గిలెస్పీ పీసీబీ నుండి విడిపోయాడు. అప్పటి నుంచి ఆకిబ్ జావేద్, అజర్ మహమూద్ వంటి తాత్కాలిక కోచ్‌లు టెస్ట్ జట్టుకు పనిచేశారు. రెండేళ్ల కాంట్రాక్ట్ తో అజర్ ను అపాయింట్ చేసుకుంది గానీ అతన్ని కూడా అర్ధాంతరంగా తొలగించింది. ఈ నేపథ్యంలో విదేశీ మాజీ ఆల్ రౌండర్ ను హెడ్ కోచ్ గా నియమించుకోవాలనే ప్రతిపాదనలను పీసీబీ గట్టిగానే పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications