వెనక్కి వచ్చిన ఫిల్ సాల్ట్: ఊపిరి పీల్చుకున్న ఆర్సీబీ
IPL 2025 final: ఐపీఎల్ 2025లో బిగ్ డే.. నేడే ఫైనల్స్. ఐపీఎల్ లో ఓ కొత్త ఛాంపియన్ ఆవిర్భవించబోయేదీ నేడే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ కొట్టబోతోంది పంజాబ్ కింగ్స్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక.
ఏ జట్టు గెలిచినా.. తొలిసారి కప్ ను ముద్దాడుతుంది. ఈ రెండింట్లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ఐపీఎల్ కప్ కొట్టలేదు. 2022 తరువాత మళ్లీ అలాంటి సీన్.. ఈ రాత్రికి రిపీట్ కాబోతోంది. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త విజేతను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది 18వ ఐపీఎల్ సీజన్.

ఇప్పటివరకు అత్యధికసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. అయిదేసిసార్లు చొప్పున కప్ గెలిచాయి. ఈ రెండింటికే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ అనే పేరు ఉంది. ఈ సారి ఈ రెండూ కూడా ఫైనల్స్ చేరలేకపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్.. లీగ్స్ దశలోనే ఇంటిముఖం పట్టగా.. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ లో ఓడిపోయింది.
ఈ రెండింటి తరువాత కోల్ కత నైట్ రైడర్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, దక్కన్ ఛార్జర్స్ ఒక్కోసారి కప్ అందుకున్నాయి. నేడు- రాయల్ ఛాలెంజర్స్ లేదా పంజాబ్ కింగ్స్.. ఈ జాబితాలో చేరనున్నాయి.
కాగా- ఆర్సీబీని తీవ్ర ఆందోళనకు గురి చేసిన ఫిల్ సాల్ట్.. స్వదేశం నుంచి అహ్మదాబాద్ కు చేరుకున్నాడు. ఈ తెల్లవారు జామున ల్యాండ్ అయ్యాడు. క్వాలిఫయర్ 1 ముగిసిన తరువాత ఫైనల్స్ ఆడటానికి చాలా వ్యవధి ఉండటం వల్ల ఇంగ్లాండ్ కు వెళ్లాడు సాల్ట్. ఫైనల్స్ కు అందుబాటులోకి వచ్చాడు.
ఫిల్ సాల్ట్ భార్య నిండు గర్భిణి. తొలి చూలు బిడ్డకు స్వాగతం పలకడానికి ఇంగ్లాండ్ వెళ్లిన అతను ఇక వెనక్కి రాకపోవచ్చంటూ మొదట్లో వార్తలొచ్చాయి గానీ.. కుటుంబం కంటే కూడా క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడీ డాషింగ్ ఓపెనర్. ప్రయాణ బడలిక వల్ల ఈ ఉదయం నరేంద్ర మోదీ స్టేడియంలో నెట్ సెషన్స్ కు అతను అటెండ్ కాలేదని మేనేజ్ మెంట్ వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications