సైనికుల రక్తం కంటే చిల్లర ఎక్కువైందా ? భారత్-పాక్ ఆసియాకప్ మ్యాచ్ పై దుమారం..!
ఈ ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి కారకులైన తీవ్రవాదుల్ని పెంచి పోషించిన పాకిస్తాన్ తో ఆసియాకప్ క్రికెట్ మ్యాచ్ కు భారత్ సిద్దం కావడంపై విమర్శలు మొదలయ్యాయి. ఆసియాకప్ టోర్నీలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ అంగీకరించడంపై పెను దుమారం రేగుతోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలే ఇప్పుడు దీనిపై తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి.
తాజాగా ఇంగ్లాండ్ లో పాకిస్తాన్ తో జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో మ్యాచ్ ను భారత క్రికెటర్లు చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్ తో ఆడేది లేదని భారత సీనియర్ క్రికెటర్లు ఈ మ్యాచ్ ను బహిష్కరించారు. దీంతో చివరి నిమిషంలో ఈ మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు మరోసారి ఆసియా కప్ టోర్నీలో మ్యాచ్ కు బీసీసీఐ ప్లాన్ చేయడంతో దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టి, దాన్ని మధ్యలోనే సీజ్ పైర్ అంటూ వదిలేసిన కేంద్రంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని వారు గుర్తుచేసుకున్నారు. సైనికుల రక్తం కంటే డబ్బులే ఎక్కువయ్యాయా అని కేంద్రాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఉద్ధవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది.. సైనికుల రక్తం కంటే డబ్బులు ఎక్కువయ్యాయంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎలాంటిదైనా, ఎక్కడ ఆడినా భారతీయులు వ్యతిరేకిస్తారని చెప్పారు. బీసీసీఐ ఈ మ్యాచ్ ను ఏ దేశంలో నిర్వహించినా భారతీయులు మాత్రం వ్యతిరేకిస్తారన్నారు. మ్యాచ్ జరిగే గ్రౌండ్ లో భారతీయులు నిరసన తెలుపుతారని హెచ్చరించారు. భారతీయులు, సాయుధ దళాల రక్తంతో లాభాలు సంపాదించుకోవడం ఆపాలని కోరారు. ఓవైపు భారతదేశ సీడీఎస్ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని చెబుతుంటే, మరోవైపు మీరు మీ రక్త ధనాన్ని సంపాదించడానికి తొందరపడుతున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications