రింకూ సింగ్ ఇంట్లో తీరని విషాదం
టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వార్త క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. తండ్రి మరణ సమాచారం అందిన వెంటనే రింకు సింగ్ చెన్నై నుండి తన స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌కు బయలుదేరాడు.
ఖాన్‌చంద్ర సింగ్ ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉండటంతో గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రి ఒమేగా 1లో క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేర్చారు. అక్కడ మెకానికల్ వెంటిలేటర్‌పై రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీతో చికిత్స పొందారు. ఆయన ప్రాణాలను కాపాడటానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఖాన్‌చంద్ర మరణించిన విషయాన్ని యథార్థ్ హాస్పిటల్ పీఆర్‌ఓ అధికారికంగా వెల్లడించారు.

తండ్రి ఆరోగ్యం క్షీణించిందన్న వార్తతో రింకు సింగ్ ఇటీవలే స్వస్థలానికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. జింబాబ్వే మ్యాచ్ కోసం అతను తిరిగి జట్టుతో కలిశాడు. అతను ఇంటికి వెళ్లొచ్చిన మూడు రోజుల్లోన ఖాన్‌చంద్ర కన్నుమూశారు. తండ్రి కారణంగా రింకూ సింగ్ తదుపరి మ్యాచ్‌లలో అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌కు అతను దూరం అవగా, సంజు శాంసన్‌కు అవకాశం దక్కింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. అయినప్పటికీ రింకు ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశారు.
రింకు సింగ్‌కు ఇది వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా సవాళ్లతో కూడుకున్న సమయం. ఈ టీ20 ప్రపంచ కప్‌లో అతని ప్రదర్శన అంచనాలకు తగట్టు ఉండట్లేదు. అమెరికా, నమీబియాపై సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. పాకిస్థాన్‌పై 4 బంతుల్లో 11 నాటౌట్ పరుగులు మాత్రమే చేశాడు. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లలో కూడా రాణించలేకపోయాడు. నెదర్లాండ్స్ పై 6, దక్షిణాఫ్రికాపై సున్నా పరుగులు చేశాడు. అయిదు ఇన్నింగ్స్‌లలో 24 పరుగులు మాత్రమే చేశాడు.












Click it and Unblock the Notifications