Sanju Samson:కింగ్ కోహ్లీ రికార్డు బద్ధలు-విరాట్, ధోనీల నుంచి నేర్చుకున్న పాఠమే..!!
భారత క్రికెట్‌లో టాలెంట్ ఉండి కూడా సరైన అవకాశాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన ఆటగాడు ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు సంజూ శాంసన్. ఆ నిరీక్షణకు, పట్టుదలకు ప్రతిఫలం దక్కిన రాత్రి ఇది. వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో శాంసన్ అజేయంగా పోరాడి భారత్‌ను టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు చేర్చాడు. ఈ క్రమంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక చారిత్రక రికార్డును కూడా తుడిచిపెట్టేశాడు.
కోహ్లీని మించిన రన్ ఛేజ్ మాస్టర్
వెస్టిండీస్ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ శాంసన్ కేవలం 50 బంతుల్లో 97 పరుగులతో (12 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రన్ ఛేజింగ్ చేస్తూ భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా సంజూ రికార్డు సృష్టించాడు. గతంలో 2016లో ఆస్ట్రేలియాపై, 2022లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ చేసిన 82* పరుగులే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. ఆ రికార్డును శాంసన్ అధిగమించడం విశేషం. అంతేకాదు, టీ20 ప్రపంచకప్ చరిత్రలో సురేష్ రైనా (101) తర్వాత భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా కూడా నిలిచాడు.

నిరీక్షణకు తగ్గ ప్రతిఫలం: సూర్యకుమార్ అభినందనలు
ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పంపిన మెసేజ్ సంజూకు ఎంతో ప్రత్యేకం. "వేచి ఉన్న వారికి మంచి రోజులు వస్తాయి (Good things happen to those who wait)" అంటూ సూర్య భాయ్ సంజూను అభినందించాడు. టోర్నీలో మొదటి మూడు గ్రూప్ మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన శాంసన్, వచ్చిన అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో ప్రపంచానికి చాటి చెప్పాడు.
"నేను గెలవకపోతే ఏంటి?" - సంజూ మనోగతం
మ్యాచ్ అనంతరం శాంసన్ తన మనసులోని భయాలను బయటపెట్టాడు. "ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ గెలవకపోతే ఏంటి? అనే ఆలోచన నా మనసులోకి వస్తూనే ఉంది. కానీ ప్రతిసారి నా మనసును మళ్ళించుకుని,కేవలం బంతిపైనే ఏకాగ్రత పెట్టాను.నన్ను నేను నమ్మాను" అని చెప్పుకొచ్చాడు.
లెజెండ్స్ నుంచి నేర్చుకున్న పాఠం
12 ఏళ్లుగా ఐపీఎల్, 10 ఏళ్లుగా జాతీయ జట్టుతో ఉన్నా..ఎన్నోసార్లు డగౌట్‌లోనే కూర్చోవాల్సి వచ్చింది.కానీ ఆ సమయాన్ని శాంసన్ వృధా చేయలేదు."విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలు కష్టకాలంలో ఎలా ఆడతారు? మ్యాచ్‌లను ఎలా ముగిస్తారు? అనేది నేను డగౌట్ నుంచి గమనిస్తూ నేర్చుకున్నాను.ఆ అనుభవమే ఈరోజు నాకు తోడ్పడింది" అని సంజూ గర్వంగా చెప్పాడు.
ఎంతో కాలంగా 'నెక్స్ట్ బిగ్ థింగ్' అనిపించుకుంటున్న సంజూ, ఎట్టకేలకు తన విశ్వరూపం చూపించాడు. కేవలం 97 పరుగులు మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానుల నమ్మకాన్ని కూడా సంపాదించుకున్నాడు. సెమీఫైనల్ పోరులో కూడా శాంసన్ ఇదే జోరు కొనసాగించి భారత్‌ను జగజ్జేతగా నిలుపుతాడని ఆశిద్దాం.












Click it and Unblock the Notifications