టీమిండియాలో ఓవర్ నైట్ స్టార్ ఆల్ రౌండర్
ఆసియా కప్ 2025లో భారత్ అదరగొట్టింది. అంచనాలకు తగ్గట్టే ఆతిథ్య దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను మట్టికరిపించింది. తొలుత బౌలింగ్ లో.. ఆ తర్వాత బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం తరహాలో కనిపించిందీ గేమ్. తన తరువాతి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఢీ కొట్టాల్సి ఉంది భారత్ కు. ఈ నెల 14వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిస్తే సూపర్ 4 ఖాయమౌతుంది.
బుధవారం రాత్రి అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన యూఏఈ.. బౌలర్ల ప్రతాపానికి తలవంచింది. ఓపెనర్లు మినహా మరే బ్యాటర్ కూడా పట్టుమని 10 కాదు కదా.. కనీసం అయిదు పరుగులు కూడా చేయలేకపోయారు. ఓపెనర్లు అలీషాన్ షరాఫు- 22, కేప్టెన్ ముహ్మద్ వసీం- 19 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లందరూ కలిపి 14 పరుగులు చేశారంతే. వీరిలో ఏ ఒక్కరు కూడా అయిదు పరుగుల మార్క్ ను కూడా అందుకోలేదు. 13.1 ఓవర్లల్లో 57 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా సునామీ ఇన్నింగ్ ఆడింది. 4.3 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 60 పరుగుల చేసింది. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30, శుభ్ మన్ గిల్ తొమ్మిది బంతుల్లో 20 పరుగులు బాదారు. రెండే బంతులు ఆడిన ఏడు పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. టీమిండియా బౌలింగ్ లో కుల్ దీప్ యాదవ్, శివం దుబే ఇద్దరు కలిసి ఏడు వికెట్లు కూల్చారు. 2.1 ఓవర్లల్లో ఏడు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు కుల్ దీప్.
రెండు ఓవర్లల్లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు శివం దుబే. ఇప్పటివరకు పెద్దగా బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు దుబేకు. ఐపీఎల్ లో కూడా బంతిని అందుకున్న సందర్భాలు తక్కువే. ఇక్కడ మాత్రం చెలరేగిపోయాడు. రెండు ఓవర్లల్లో నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇవి. బ్యాటర్ గా మాత్రమే తెలిసిన శివం దుబే ఈ మ్యాచ్ తో ఆల్ రౌండర్ గా ఎదిగినట్టయింది.












Click it and Unblock the Notifications