శుభ్‌మన్ గిల్ అవుట్
టీ20 వరల్డ్ కప్ 2026 ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. టీ 20 వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లోనూ ఇదే జట్టు ఆడుతుంది. ఈ జట్టులో వైస్ కేప్టెన్ శుభ్ మన్ గిల్ కు చోటు దక్కలేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఎంపిక అయ్యాడు. వైస్ కేప్టెన్ గా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నియమితుడయ్యాడు. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో 20 జట్లు పాల్గొని మొత్తం 55 మ్యాచ్‌లు ఆడతాయి.
ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్స్ ఆడబోయే జట్టులో ఈ ఒక్కటి తప్ప పెద్దగా మార్పులు చేర్పులేవీ చోటు చేసుకోలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. టాప్ ఆర్డర్ లో తిలక్ వర్మ, లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఈ జట్టులో కొనసాగుతున్నారు. మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్రమోషన్ లభించింది. శుభ్ మన్ గిల్ స్థానంలో వైస్ కెప్టెన్సీ అతనికి దక్కింది.

రింకూ సింగ్ కూడా టీ20 ఇంటర్నేషనల్స్ లో రీఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు అవకాశం లభించిందీ జట్టులో. 2023లో టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్.. పునరాగమనం చేయడం హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనపర్చడం ప్లస్ పాయింట్ అయింది. అటు కేప్టెన్ గా కూడా తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న జార్ఖండ్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు ఇషాన్ కిషన్.
ప్రపంచకప్‌కు ఎంపికైన జట్టులోని ఆటగాళ్లే న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో కూడా ఆడనున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ప్రపంచకప్‌కు సన్నాహాలకు చివరి అవకాశం కావడంతో చాలా కీలకంగా మారింది. జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాగా, 21 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా నేరుగా ప్రపంచకప్ ఆడుతుంది.
ఈ జట్టులో- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్ (వికెట్ కీపర్) వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్ ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications