India-Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ పై బిగ్ ట్విస్ట్-రంగంలోకి మాజీలు?
ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ తో పాటు ఇతర మెగా టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్ (india pakistan match) తప్పనిసరి. ఈ మ్యాచ్ అంటూ లేకపోతే సదరు టోర్నీల్ని చూసే వారే ఉండరు. అలాంటిది ఈసారి టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ కు సంఘీభావంగా భారత్ తో ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో ఈ మ్యాచ్ చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు షాకయ్యారు. ఈ నేపథ్యంలో ఐసీసీ పాకిస్తాన్ కు హెచ్చరికలు చేయడం ప్రారంభించింది. అయినా పరిస్ధితి మారే ఛాన్స్ లేదని తేలడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలయ్యాయి.
గతంతో పోలిస్తే ఈసారి టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠ ఎక్కువగా ఉంది. ఇరుదేశాల మధ్య గతేడాది తలెత్తిన ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత సీజ్ ఫైర్ వంటి పరిణామాలతో పాకిస్తాన్ ను ఎలాగైనా మరోసారి ఓడించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా అండర్ 19 వరల్డ్ కప్ లో సైతం పాకిస్తాన్ జట్టును భారత్ ఓడించింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నా.. బంగ్లాదేశ్ కు మద్దతుగా భారత్ తో మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేయాలని నిర్ణయించడంతో క్రికెట్ వర్గాలు షాకయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ ఎలాగైనా జరిగేలా చూడాలన్న ఒత్తిడి ఐసీసీపై పెరుగుతోంది.

దీంతో ఐసీసీ నేరుగా పాకిస్తాన్ కు ఆర్ధిక ఆంక్షలు, క్రికెట్ టోర్నీల బహిష్కరణ, పాకిస్తాన్ లీగ్ లో విదేశీ క్రికెటర్లకు ఎన్వోసీలు ఇవ్వబోమన్న హెచ్చరికలు చేస్తూనే .. మరోవైపు తెరవెనుక దౌత్య ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మాజీ క్రికెటర్లతో మాట్లాడించడంతో పాటు వీలైనన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా ఫిబ్రవరి 15న ఎలాగైనా భారత్-పాక్ మ్యాచ్ ఉండేలా చూడాలని ఐసీసీ భావిస్తోంది. అందుకే పాకిస్తాన్ నిర్ణయం ప్రకటన తర్వాత తెరవెనుక దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దీంతో పాకిస్తాన్ మనసు మార్చుకునే అవకాశం ఉందని గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా చెప్తున్నారు.












Click it and Unblock the Notifications