T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..!
టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టిన భారత్ మరోసారి ఫైనల్ చేరిపోయింది. అజేయంగా టోర్నీని ఆరంభించి, మధ్యలో సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఒత్తిడిలోకి వెళ్లి, తిరిగి పుంజుకుని అద్వితీయ ప్రదర్శనతో నిన్న ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీని వెనుక టీమ్ లో ప్రతీ ఆటగాడి పాత్రా కనిపిస్తోంది. కేవలం ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఒక్కడే ఇందుకు మినహాయింపు. ఈ చర్చే అతనిపై మరింత ఒత్తిడి పెంచుతోంది.
ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ను ఎదుర్కోబోతున్న వేళ టీమిండియా క్రికెటర్లతో పాటు జట్టు మేనేజ్ మెంట్ సైతం అభిషేక్ శర్మపై భరోసా ఉంచుతోంది. తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా అతని సొంతం అని భావిస్తోంది. దీంతో ఫామ్ తో సంబంధం లేకుండా అభిషేక్ శర్మను జట్టులో ఆడిస్తోంది. ఇప్పుడు ఫైనల్ వేళ మరోసారి అభిషేక్ శర్మ ఫామ్ పై చర్చ జరుగుతుండగా..దీంతో సంబంధం లేకుండా అతనికి ఇంగ్లాండ్ మ్యాచ్ హీరో, తోటి ఓపెనర్ సంజూ శాంసన్ (sanju samson) అండగా నిలిచాడు.

తమకు గొప్ప డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఉందని, తమ మేనేజ్ మెంట్ కు అభిషేక్ పై చాలా నమ్మకం ఉందని, తామంతా అతనికి మద్దతు ఇస్తున్నామని సంజూ శాంసన్ ఇంగ్లండ్ పై మ్యాచ్ తర్వాత వెల్లడించాడు. ప్రతి ఆటగాడూ ఒడిదుడుకుల గుండా వెళతాడని, మధ్యలో కొన్ని మంచి షాట్లు రావచ్చని, అలాగే ఈ ఫార్మాట్‌లో ప్రతిదీ మారొచ్చని సంజూ తెలిపాడు. తాము ఇప్పటికీ అతనిని నమ్ముతామని, ఎవరికి తెలుసు బహుశా ఫైనల్ అతని రోజు కావచ్చని సంజూ ధీమా వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు కచ్చితంగా అభిషేక్ శర్మలో ధీమా నింపేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications