U-19 AsiaCup: వైభవ్ సూర్యవంశీ వీర బాదుడు..! ఈసారి 95 బంతుల్లో 171..!
దుబాయ్ లో జరుగుతున్న అండర్ 19 ఆసియాకప్ లో భారత్ దుమ్ము రేపింది. ఇవాళ జరిగిన తొలి మ్యాచ్ లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ భారీ సెంచరీతో దుమ్మురేపడంతో యూఏఈ జట్టుపై తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది. 2026లో జరిగే అండర్-19 వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ టోర్నీఆరంభ మ్యాచ్ లో వైభవ్ సూపర్ ఇన్నింగ్స్ తో భారత్ ఏకంగా 433 పరుగులు స్కోరు చేసి భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి యూఏఈ ముందు ఉంచింది.
ఉదయం దుబాయ్ లో మొదలైన అండర్ 19 ఆసియాకప్ మ్యాచ్ లో యూఏఈ చేతిలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 56 బంతుల్లోనే ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో వైభవ్ సెంచరీ సాధించాడు. అలవోకగా స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ యూఏఈ ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత కూడా వైభవ్ దూకుడు కొనసాగింది. చివరికి 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 95 బంతుల్లోనే 171 పరుగులు చేసిన సూర్యవంశీని స్పిన్నర్ ఉద్దీష్ సూరి బౌల్డ్ చేసాడు. దీంతో వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది.

వైభవ్ సూర్యవంశీ భారీ సెంచరీ సాయంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 433 పరుగులు సాధించింది. అనంతరం యూఏఈ లక్షఛేదనలో తడబడుతోంది. వైభవ్ సూర్యవంశీ 171 పరుగుల ప్రదర్శన.. 2002లో అంబటి రాయుడు నెలకొల్పిన 177 పరుగుల రికార్డుకు ఆరు పరుగుల దూరంలో నిలిపింది. అయితే ఇది యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక స్కోరుగా ఉంది.
ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌పై సూర్యవంశీ చేసిన 143 పరుగుల తర్వాత.. యూత్ వన్డేల్లో ఈ టీనేజర్‌కు ఇది రెండో సెంచరీ.
ఈ నెలలోనే సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బీహార్-మహారాష్ట్ర మధ్య జరిగిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో సూర్యవంశీ తన తొలి సెంచరీ సాధించాడు. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.












Click it and Unblock the Notifications