వినేష్ ఫోగట్ చనిపోతుందనుకున్నా.. భయానక పరిస్ధితిని వివరించిన కోచ్..!
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో ఫైనల్ వరకూ చేరుకున్న తర్వాత అనూహ్య పరిస్ధితుల్లో అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆ సమయంలో ఎదుర్కొన్న భయానక పరిస్ధితుల్ని ఆమె కోచ్ బయటపెట్టారు. ఓ దశలో ఆమె చనిపోతుందని అనుకున్నట్లు కోచ్ తెలిపారు. సెమీ ఫైనల్ తర్వాత బరువు తగ్గాల్సిన పరిస్ధితుల్లో వినేష్ పడ్డ వేదనను కళ్లకు కట్టినట్లు కోచ్ వోలర్ అకోస్ వెల్లడించారు.
పారిస్ గేమ్స్‌లో వినేష్ ఫోగాట్ కోచ్ గా వ్యవహరించిన వోలర్ అకోస్.. తెరవెనుక ఆమె ఎదుర్కొన్న భయానక పరిస్ధితుల్ని ఇవాళ బయటపెట్టారు. సెమీ-ఫైనల్ తర్వాత 2.7 కిలోల అదనపు బరువు మిగిలిపోయిందని, దాన్ని తగ్గించుకునే క్రమంలో వినేష్ కఠిన పరిస్ధితుల్ని ఎదుర్కుందని తెలిపారు. గంటా ఇరవై నిమిషాలు ఆమెతో వ్యాయామం చేయించామని, కానీ ఆమె బరువు ఇంకా 1.5 కిలోలు మిగిలి ఉండిపోయిందన్నారు.

ఆ తరువాత 50 నిమిషాల ఆవిరి పట్టాక వినేష్ పై చెమట చుక్క కనిపించలేదన్నారు. కానీ తమకు మరో దారి లేదన్నారు. అర్ధరాత్రి నుండి ఉదయం ఐదున్నర వరకు వినేష్ వేర్వేరు కార్డియో మెషీన్లు, రెజ్లింగ్ వ్యాయామాలు చేసిందన్నారు. ఒకేసారి మూడు వంతులు ఎక్కువగా రెండు-మూడు నిమిషాల విశ్రాంతితో చేస్తూ మళ్లీ ప్రారంభించేదన్నారు. దీంతో ఆమె కుప్ప కూలిందన్నారు. ఆమెను చాలా కష్టపడి పైకి లేపామన్నారు. ఆ తర్వాత ఓ గంట ఆవిరి స్నానంలో గడిపిందని, ఆ సమయంలో ఆమె చనిపోవచ్చని తాను భావించినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పుడు కోచ్ వాదన చూస్తుంటే వినేష్ ఎలాంటి అగ్నిపరీక్ష ఎదుర్కొందో తెలుస్తోంది.












Click it and Unblock the Notifications