టీమిండియాకు అందుబాటులో స్టార్ ఆల్ రౌండర్: బుమ్రా, నితీష్ భవితవ్యం తేలేది రేపే
శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు ఇటీవలే జింబాబ్వే పర్యటనను దిగ్విజయంగా ముగించుకుంది. ఈ సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్ లల్లో చవి చూసిన పరిపూర్ణ ఓటముల గాయాన్ని జింబాబ్వే సిరీస్ కొంతవరకు నయం చేయగలిగింది. ఇక తన తదుపరి సిరీస్ కు సమాయాత్తమౌతోంది టీమిండియా. ఈ నెలలో మూడు టీ20 మ్యాచ్ లను ఆడబోతోంది. ఈ సారి.. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడబోతోంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనున్నాయి.. ఈ మూడు మ్యాచ్ లు కూడా. ఈ సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ లో భారత్ తో సిరీస్ కు ఆ దేశ జట్టు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. సెప్టెంబర్ 13వ తేదీన మొదటి మ్యాచ్ ఆరంభమౌతుంది. 15, 17 తేదీల్లో మిగిలిన రెండింటినీ నిర్వహిస్తారు. ఒకే స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్లు ఆడబోతోండటం పట్ల క్రేజ్ ఏర్పడింది.

ఈ సిరీస్ కోసం టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిల భవితవ్యం ఇంకా తేలాల్సి ఉంది. ఈ ముగ్గురూ కూడా ఇంకా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ లోనే ఉన్నారు. వీరితో పాటు మరో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్ క్లియరెన్స్ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంటోంది.
బుమ్రా ఫిట్ నెస్ బుధవారం తేలిపోనుంది. ఈ ఫైనల్ ఫిట్ నెస్ టెస్ట్ లో అతని కదలికలు, వేగాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాతే క్లియరెన్స్ ఇస్తామని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలిపింది. యువ పేసర్ హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ నివేదికల కోసం కూడా బీసీసీఐ వేచి చూస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే నిర్దేశిత సిమ్యులేషన్స్ ను విజయవంతంగా పూర్తి చేశారు. అయినప్పటికీ.. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి వీరికి పూర్తి స్థాయి అధికారిక క్లియరెన్స్ లభించలేదు. బుధవారం సాయంత్రానికి వీరి తుది ఫిట్నెస్ నివేదిక వెలువడే అవకాశం ఉంది.
కీలకమైన టీ20 ప్రపంచకప్ సన్నాహకాల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే ఈ సిరీస్ భారత్కు ఎంతో కీలకం. ఇలాంటి తరుణంలో వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్తో తిరిగి రావడం భారత జట్టు మేనేజ్మెంట్కు కొండంత బలాన్ని ఇస్తోంది. మిగిలిన ముగ్గురు కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ నివేదికలు కూడా సానుకూలంగా వస్తే, టీమిండియా పూర్తిస్థాయి జట్టుతో ఈ సిరీస్ ఆడినట్టవుతుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది కూడా.
ఇందులో.. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా ఎంపికయ్యారు. నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా ఆడే అంశం వారి ఫిట్నెస్ నివేదికలపై ఆధారపడి ఉంటుంది.














Click it and Unblock the Notifications
