Vinesh Phogat: నాడు ఢిల్లీ రోడ్లపై ధర్నా: నేడు ఒలింపిక్స్‌లో చారిత్రాత్మ గెలుపు
వినేష్ ఫొగట్. ఈ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల కేసులో రోజుల తరబడి ఢిల్లీ నడిరోడ్ల మీద ఆందోళన చేసిన భారత మహిళా రెజ్లర్. మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారని, ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కిన రెజ్లర్లల్లో ఆమె ఒకరు. రోజుల తరబడి నిరసనలు కొనసాగించారు.
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హాతో కలిసి జంతర్ మంతర్ వద్దే ఫుట్‌పాత్‌పై నిద్రించిన రోజులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ పోడియం నుంచి ఫుట్‌పాత్ వరకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ద్వారా ఎన్నో అవమానాలు, వేధింపులను ఎదుర్కొన్నామని, తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ మీడియా ఎదురుగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం.

అలాంటి వినేష్ ఫొగట్.. పారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. పతకం వైపు అడుగులు వేశారు. మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో భాగంగా జరిగిన 16వ రౌండ్ పోటీల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. 3-2 పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన యుయి సుసాకీని మట్టికరిపించారు.
యుయి సుసాకీ అల్లాటప్పా రెజ్లర్ కాదు. వరల్డ్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో గతంలో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సైతం అందుకున్నారు. అలాంటి రెజ్లర్‌కు చుక్కలు చూపారు వినేష్ ఫొగట్. క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టారు.
క్వార్టర్ ఫైనల్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను ఎదుర్కొంటారు. 2016 రియో డి జనేరియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 10, 9 స్థానాలతోనే సరిపెట్టుకున్న వినేష్ ఫొగట్.. ఈ సారి మాత్రం అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టగలిగారు.
సుసాకీపై జరిగిన బౌట్‌లో మొదట వెనుకంజలో కనిపించారు వినేష్ ఫొగట్. 0-2 తేడాతో సుసాకీ పూర్తి ఆధిపత్యాన్ని కనపర్చారు. ఆ సమయంలో ఫొగట్ పుంజుకున్నారు. ప్రత్యర్థికి ఎంతమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒకదశలో 2-2తో సమానంగా నిలిచారు. చివరి బౌట్ 20 సెకెన్లలో ముగుస్తుందనగా ఒక్కసారిగా విజృంభించారు. సుసాకీని ఓడించారు.












Click it and Unblock the Notifications