ఉత్సాహం వేటలో చిరు!

ప్రజారాజ్యం రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గౌడ్ మెల్లగా తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడం ఆ పార్టీకి కలవరం కలిగించే విషయమే. అయినా చిరంజీవి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఆయన వర్గానికి చెందిన నాయకుల్లో కూడా నైరాశ్యం అలుముకుంది. నాగబాబు కూడా పార్టీని పట్టించుకోవడం లేదు. అల్లు అరవింద్ కూడా హిందీ మగధీర నిర్మాతగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు.
మరో మూడేళ్ళు ఇలా గడిపేసి ఎన్నికలకు ఏడాదిన్నర ముందు విజృంభించాలన్న ఆలోచనలో చిరంజీవి ఉన్నారు. అందుకోసం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వీలైతే జనంలో తన ఇమేజిని పెంచుకోడానికి రెండు మూడు మంచి సినిమాల్లో నటించాలని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాపు ఓట్లు పూర్తిగా ప్రజారాజ్యం పార్టీకి పడ కుండా రాజశేఖరరెడ్డి గండి కొట్టగలిగారు. ఈసారి ఆ మహా నాయకుడు లేరు కాబట్టి కాపు ఓట్లు కట్టగట్టుకుని తమకే పడతాయని ప్రజారాజ్యం మేధావులు లెక్కలు కడుతున్నారు.
భావసారూప్యత గల పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని కూడా చిరంజీవి భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అత్యాశకు పోయి అన్ని స్ధానాలకు పోటీ చేయడం వల్ల నష్టపోవలసి వచ్చిందన్న అభిప్రాయానికి ఆయన వచ్చినట్టు చెబుతున్నారు. ఈలోపు సొంతంగా మీడియా గ్రూపును పెట్టుకోవడమో, లేదా కొన్ని మీడియా సంస్ధలతో లోపాయికారీ ఒప్పందాలను కుదుర్చుకోడానికో ప్రయత్నించాలని చూస్తున్నారు.












Click it and Unblock the Notifications