• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రంగా సిన్మా ఒప్పుకోని చిరంజీవి

By Staff
|

Chiranjeevi
హైదరాబాద్: సామాజిక న్యాయం మీద చిరంజీవి చిలకపలుకులు వల్లించడంపై విమర్శలు వస్తున్నాయి. సినిమారంగంలో ఒక సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న సమయంలో చిరంజీవి వినయంతో, ప్రతిభతో, స్వయంకృషితో పైకి వచ్చారు. వెండితెర మీద పాతికేళ్ళ పాటు పసిడి పంట పండించిన ఘనత చిరంజీవిది. అయితే తాను ఎదుగుతున్న సమయంలో ఆయన ఆ సామాజిక వర్గంతోనే కలివిడిగా ఉన్నారు కానీ తన జాతిని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి.

ఇటీవల వంగవీటి రంగా తనయుడు విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను తన పార్టీలోకి చేర్చుకున్నారు చిరంజీవి. రాధా చేరిక వందర్భంగా చిరంజీవి చేసిన నాటకీయ వ్యాఖ్యలు, రంగా గురించి ఒలకబోసిన అభిమానం చిరు నటనకు పరాకాష్ట అని విజయవాడకు చెందిన ఒక ప్రముఖ కాపు నాయకుడు వ్యాఖ్యానించారు. ఆయన ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటనను వివరించారు.

చిరంజీవి హీరోగా సామాజిక న్యాయం మీద రంగా సినిమా తీయాలనుకుని సంప్రదించారు. చిరంజీవి అప్పటికే దాదాపు టాప్ స్ధానానికి చేరుకున్నారు. రంగా విజయవాడలోనే కాకుండా కోస్తా ఆంధ్రలో బలమైన నాయకుడిగా ఎదిగారు. రంగా ఒక వైపు తన సామాజిక వర్గాన్ని కాపాడుకుంటూ మరో వైపు ఒక బలమైన వర్గానికి వ్యతిరేకంగా సమాజంలోని అణగారిన కులాలన్నిటినీ ఒక తాటి మీదికి తెచ్చి సామాజిక న్యాయం కోసం ప్రాక్టికల్ గా పోరాడారు. ఆ క్రమంలో ఆయన రౌడీ రాజకీయాలు నడుపుతున్నారన్న విమర్శలు వచ్చినా ఆయన తనదారిలో తాను సాగిపోయి, చివరికి ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు.

రంగా నిర్మించే సినిమాలో తాను నటించినా, ఆయనకు సన్నిహితంగా మెలిగినా తన సినిమా కెరియర్ కు నష్టం కలుగుతుందని చిరంజీవి ఆనాడు ఆ సిన్మాలో నటించడానికి నిరాకరించారని, కావాలంటే దాసరి నారాయణరావు అడిగి వాస్తవం తెలుసుకోవచ్చని ఆ విజయవాడ నాయకుడు చెప్పారు. రంగాను నరనరాల్లో వ్యతిరేకించే అశ్వనీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి దూరమైపోతానన్న భయంతో చిరంజీవి రంగాకు దూరంగా ఉంటూ వచ్చారట.

రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఇప్పుడు తన సామాజిక వర్గం అండ కోసం ఆరాటపడుతూ, అందులో భాగంగా రాధాను చేర్చుకోవడాన్ని దాసరి నారాయణరావు వంటి వారు కూడా విమర్శించడానికి కారణమైంది. 1988లో రంగా హత్య తర్వాత దాసరి నారాయణ రావు కాంగ్రెస్ పార్టీ తరఫున కోస్తా ఆంధ్రలో కొన్ని వందల బహిరంగ సభలు నిర్వహించి, రంగాకు జరిగిన అన్యాయాన్ని ఉద్వేగంగా వివరించి, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తన వంతు కీలక పాత్ర వహించారు.

ఇంతకీ చిరంజీవి నిరకరించిన రంగా సినిమా ఏమిటి? పాతికేళ్ళ క్రితం "చైతన్యరథం" అనే సినిమాను తీయాలని రంగా సంకల్పించారు. తన అన్న వంగవీటి రాధా ( కొడుకుకు అదే పేరు పెట్టుకున్నారు) పేదల నాయకుడిగా ఎలా ఎదిగాడో, పెత్తందార్ల చేతుల్లో ఎలా హత్యకు గురయ్యాడో అన్నది ఆ సినిమా ప్రధాన కథాంశం.

రంగా దాసరిని సంప్రదించగా అప్పట్లో విప్లవ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న ధవళ సత్యం ను డైరెక్టర్ గా సిఫార్సు చేశారట. చిరంజీవి హీరో అయితే బాగుంటుందని సలహా ఇచ్చి చిరంజీవికి ఫోన్ చేసి, ఎమ్మెల్యే రంగా వచ్చి కలుస్తారని చెప్పారట.కానీ చిరంజీవి రంగాకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని, ఈ వాస్తవం రంగా సన్నిహితులకు దాసరికి, కోడి రామకృష్ణకు బాగా తెలుసని చెబుతున్నారు. ఈ విషయంలో దాసరి నారాయణరావు నోరు మెదిపి, ప్రజలకు చారిత్రక వాస్తవాలను తెలియజెప్పాలని విజయవాడ సీనియర్ సిటిజెన్లు కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీకి దాసరే నాయకత్వం వహించాలి కాబట్టి కోస్తా ఆంధ్ర బహిరంగ సభల్లో ఆయన ఈ వాస్తవాన్ని బయటపెడతారని కాంగ్రెస్ నాయకులు ఆశాభావంతో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X