డిఎస్ తో రాయ'బేరాలు?'

పార్టీ అధ్యక్షుడు క్రియాశీలకంగా ఉండి, ముఖ్యమంత్రి పార్టీ వ్యవహారాలను పక్కన పెట్టేసి పాలనాయంత్రాంగం చూసుకుంటే సరిపోతుందనే భావన కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంలో ఒకటి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిఎస్ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ వ్యవహారాలు చూస్తూ పార్టీని బలోపేతం చేయడానికి సరిపోతారని, పార్టీ వ్యవహారాల్లో కూడా తానే ఆధిపత్యం చెలాయించే ముఖ్యమంత్రి ఉంటే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు అంటున్నారు. ఈ స్థితిలో జగన్ వ్యవహారాన్ని పక్కన పెట్టేసి కొంత కాలం వేచి చూద్దామని అధిష్ఠాన వర్గం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. మూడు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ముగిసే వరకు ఎలాగూ ఆగక తప్పదు. ఆ తర్వాత కూడా రోశయ్య, డిఎస్ జోడీని అలాగే కొనసాగించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలపడుతోంది.
అధిష్ఠానవర్గం ఎటూ తేల్చకపోవడంతో వైయస్ జగన్ వర్గంలో ఆందోళన చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో డి.శ్రీనివాస్ తో రాయబారాలు నడుపుతున్నట్లు కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటీవల కెవిపి రామచందర్ రావు కూడా డిఎస్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గాంధీభవన్ లో ఆయనను కలిశారు. తాజాగా, శుక్రవారం మంత్రి బొత్సా సత్యనారాయణ డి. శ్రీనివాస్ ను కలిశారు. బొత్సా సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. డిఎస్ ను సుముఖం చేసుకుని వైయస్ జగన్ కు మార్గం ఏర్పరిచే ఆలోచనలో భాగంగానే కెవిపి వ్యూహ రచన చేసి రాయబారాలు నడుపుతున్నట్లు భావిస్తున్నారు. తదుపరి పరిణామాలు ఈ ఊహాగానాల్లోని వాస్తవాలను బయటపెడతాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications