బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్

తెలుగుదేశం కోసం ప్రచార రంగంలోకి దిగిన ప్రముఖ సినీ నటుడు సింగనమలై జూనియర్ ఎన్టీఆర్ చిన్న పిల్లవాడా. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఆయనను చిన్న పిల్లవాడిగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజశేఖర రెడ్డి బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బహిరంగ సభలో అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి ఓట్లు రాలవని కూడా ఆయన తరుచుగా అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ తో వేరేవాళ్లు పలికిస్తున్నారని చిరంజీవి ఇటీవల అన్నారు.
తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రచార పర్వంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల్లోనే ఎంతో పరిణతి సాధించారు. ఆయన చేస్తున్న ప్రసంగాలను చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏ రాజకీయ నాయకుడికీ తీసిపోని రీతిలో ఉన్నాయి. ఆయన వాచకం కూడా చిరంజీవి, బాలకృష్ణల కన్నా మెరుగ్గా ఉందని చెప్పక తప్పదు. ఆయన రోడ్ షోలకు విపరీతమైన జనాదరణ లభిస్తోంది. అయితే, వచ్చిన జనాలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారా అంటే చెప్పలేం. కానీ, ఏదో మేరకు ఓటర్లను ఆయన రోడ్ షోలు ప్రభావితం చేస్తాయని చెప్పక తప్పదు.
ఇతర పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలకు జూనియర్ ఎన్టీఆర్ ధీటుగానే సమాధానమిచ్చారు. తానేమీ చిన్న పిల్లవాడిని కానని ఆయన అన్నారు. తాను చిన్న పిల్లవాడినైతే 18 ఏళ్లకే ఎందుకు ఓటు హక్కు ఇచ్చారని ఆయన అడుగుతున్నారు. తనకు అన్నీ తెలుసునని, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా తెలుసునని ఆయన అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నవారు గుర్తించారో లేదో తెలియదు గానీ ఆయన స్పష్టమైన లక్ష్యంతో ఉన్నారు. స్వర్గీయ ఎన్టీరామారావు వారసత్వాన్ని సొంతం చేసుకోవాలనే కసితో ఆయన ఉన్నారని చెప్పవచ్చు. అందుకు అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులను, బాబాయి బాలయ్యను, మామ చంద్రబాబును నొప్పించకుండా ప్రజల్లోనే ఆ విషయాన్ని తేల్పుకోవాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications